Widow Pension Issue in Hanamkonda : 'నాకు పింఛన్ వస్తలేదని బ్యాంకుకు పోయినా. అక్కడ సార్లను అడిగితే నేను చనిపోయినట్లు లిస్టులో ఉందని చెప్పిండ్రు. అయ్యో ఇదేంది సారూ, నేను మీ ముందే ఉన్నా. నేనెట్ల చనిపోయిన, మరి నాకు నా పింఛను రావాలంటే ఏంజేయాలే' అంటూ అడిగితే సంబంధిత అధికారులను కలవాలని చెప్పారు. గత మూడు నెలలుగా తిరుగుతున్నా నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు' అని ఓ వృద్ధ వితంతువు వాపోయిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.
'నా పింఛన్ ఇందుకోసం రావట్లేదా? - బతికుండగానే చంపేశారు కదా సారూ' - WIDOW PENSION ISSUE IN HANAMKONDA
చనిపోయినట్లు ఆన్లైన్లో నమోదు చేసి వృద్ధ వితంతువు పింఛన్ నిలిపివేసిన అధికారులు - 3 నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కలగని మోక్షం
Published : Oct 10, 2024, 2:04 PM IST
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం :హనుమకొండ జిల్లా ఎల్లతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన ధర్మారం సారక్క భర్త మరణించాడు. 15 ఏళ్ల నుంచి వితంతువు పింఛన్ పొందుతోంది. కూలీ చేసుకుంటూ వచ్చిన పింఛన్తో జీవనం సాగిస్తోంది. జులైలో పింఛన్ రాకపోవడంతో బ్యాంకుకు వెళ్లింది. అక్కడ తనకు పింఛన్ డబ్బులు పడలేవని బ్యాంకు సిబ్బందిని అడిగింది. దాంతో తను చనిపోయినట్లు నమోదైందని అందుకే డబ్బులు రావడం లేదని వృద్ధురాలితో చెప్పారు. దీంతో కంగుతిన్న వృద్దురాలు, గత మూడు నెలల నుంచి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం, ఎల్కతుర్తి మండలం పరిషత్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. కానీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది.
వయసు భారంతో కూలీ పనికి వెళ్లడం లేదని, తనకు జీవనాధారంగా ఉన్న పింఛన్ నిలిచిపోవడంతో పూట గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన అధికారులు తనకు పెన్షన్ వచ్చేలా చూడాలని కోరుకుంది. ఈ విషయమై ఎంపీడీవో విజయ్ కుమార్ను వివరణ కోరగా పెన్షన్ నిలిచిపోవడంలో తమ తప్పిదం లేదని ఆన్లైన్లో సమ్మక్క మృతి చెందినట్లు తప్పుగా నమోదు కావడంతోనే పింఛన్ నిలిచిపోయినట్లు గుర్తించామన్నారు. వారం పది రోజుల్లో సమస్యను పరిష్కరించి సమ్మక్కకు పింఛన్ అందేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఏదేమైనా బ్రతికుండగానే చనిపోయిందంటూ పెన్షన్ నిలిపివేసిన అధికారుల తీరు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.