Officers Business with Srisailam Reservoir Water : కృష్ణా పరివాహకంలో వర్షాభావ పరిస్థితులు శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత దృష్ట్యా ఈ ఏడాది ఖరీఫ్ కాలానికీ సాగునీటి ఇబ్బందులు రాకుండా అధికారులు వారబందీ నిర్వహించారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో వారం నీరందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే స్థానికంగా ఉన్న కొందరు జలవనరులశాఖ అధికారులు రైతుల నుంచి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటికే మిర్చి సాగుచేసిన బడా రైతులతో కలిసి కొందరు అధికారులు ఈ ప్రణాళిక రచించినట్లు తెలిసింది. ఖరీఫ్ (Kharif) పూర్తయ్యాక కాలువలు కట్టేసినా మిర్చికి నీళ్లందించేలా వారితో ఒప్పందం చేసుకున్నారు. ఒక రాష్ట్ర స్థాయి అధికారికి సన్నిహితులైన స్థానిక అధికారులు ఇద్దరు ఇందుకు పథకరచన చేశారు. ఈ క్రమంలో డిసెంబరు 15న బంద్ చేయాల్సిన కేసీ కాలువ ఆ తర్వాత కూడా కొనసాగుతోంది.
Srisailam Reservoir Water in AP :గడివేముల, నంద్యాల, గోస్పాడు, సిరివెల్ల, దోర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో కొన్ని స్లూయిస్‌ల కింద బడా రైతులు మిర్చిసాగు చేపట్టారు. మిర్చి పంటకు ఎకరానికి లక్షన్నర రూపాయల వరకూ ఖర్చవుతోంది. నీళ్లకు కొంత ఖర్చుచేసేందుకూ బడా రైతులు వెనకాడట్లేదు. పైకి ఎమ్మెల్యేల ఒత్తిడి, కుంటలకు నీళ్లని చెబుతున్నా వాస్తవం మాత్రం వేరు.
కేసీ కాలువ బంద్ : కేసీ కాలువ కింద మొత్తం కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో లక్షా 75 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. వర్షాలు లేకపోవడంతో ఆయకట్టు కింద వర్షాధార, ఆరుతడి పంటలే సాగుచేయాలని 2023 ఆగస్టు 8న నీటిపారుదల సలహామండలి సమావేశంలో తీర్మానించారు. అప్పటికే సాగు చేసిన పంటల్ని కాపాడేందుకు సుంకేశుల, పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కాపాడాలని నిర్ణయించారు. 2023 నవంబరు 25న మరోసారి సమావేశమైన నీటిపారుదల సలహామండలి డిసెంబరు 15 కల్లా కేసీ కాలువ బంద్ చేయాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుత నీటి సంవత్సరంలో ఫిబ్రవరి వరకూ కేసీ కాలువకు నీళ్లు ఇచ్చారు. ఖరీఫ్ కాలం ముగిసినా, కేటాయింపుల మేరకు నీటి విడుదల దాటినా ముందస్తుగా ఇండెంటు, కారణాలు చూపకుండా అనధికారికంగా నీటిని విడుదల చేసేశారు.