Incomplete Samagra Kutumba Survey in Hyderabad : హైదరాబాద్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దారితప్పింది. నగరంలో వేలాది అపార్టుమెంట్లకు ఎన్యూమరేటర్లు వెళ్లకుండానే వెళ్లినట్లు సర్వే ఫారాలను వారే నింపేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తమకు ఆసక్తి లేదని ఆప్షన్‌తో సర్వే ఫారాలపై సిబ్బందే పేర్కొంటూ సర్వే ముగిసిందనిపిస్తున్నారు. దాదాపు అధికారులు 20 శాతం ఇళ్లల్లో సర్వే చేయలేదు. నగరంలో డిసెంబర్ 2న సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించగా తమ ఇంటికి ఎవరూ రాలేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఎవరూ రాకపోయిన ఫర్వాలేదంటూ సరిపెట్టుకుంటున్నారు.
కాగా ప్రజల నుంచి సేకరించిన సమాచారం కూడా అసంపూర్తిగా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఐఏఎస్ అధికారులు, పురపాలకశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షించినప్పటికీ ఫలితం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. సుమారు 70 ప్రశ్నలతో రూపుదిద్దుకున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పత్రాన్ని చూసి ప్రారంభంలో ప్రజలు తమ వివరాలు ఇచ్చేందుకు వెనకడుగు వేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేయగా వెంటనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీంతో సర్వేకు వెళ్లే ఎన్యుమరేటర్లకు స్వేచ్ఛ ఇచ్చింది. అయితే ఎక్కువ మంది సిబ్బంది ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోగా.. మరికొందరు దుర్వినియోగం చేశారు. సర్వే చేయడానికి, తిరగడానికి బద్ధకమై కాలనీలోని దుకాణాలు, చెట్ల కింద కూర్చుని వారే సర్వే పత్రాలను పూరించారనే ఆరోపణలు వస్తున్నాయి.