NRSC Collaborated With Hydra To Monitor Lakes in Hyderabad :చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ ఛాయాచిత్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను గుర్తించడమే కాకుండా లోతట్టు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు కూడా ఈ చాయాచిత్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. హైదరాబాద్ బాలానగర్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) కార్యాలయాన్ని సందర్శించిన రంగనాథ్ ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్, డిప్యూట డైరెక్టర్ శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దశాబ్దాల నాటి శాటిలైట్ ఇమేజ్‌లను పరిశీలించారు.
'జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇక నుంచి కూల్చివేతలు ఉండవు' - కీలక ప్రకటన చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
చెరువుల పరిరక్షణలో ఎన్‌ఆర్‌ఎస్‌సీ కూడా భాగస్వామ్యం కావాలని హైడ్రా కమిషనర్ కోరడంతో అందుకు వారు అంగీకారం తెలిపారు. 1973 నుంచి 2024వరకు ఎక్కువ వర్షపాతం నమోదైన డేటా ఆధారంగా అప్పటి శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, గ్రామీణ మ్యాప్‌ల నుంచి సమాచారాన్ని సేకరించామని ఎన్‌ఆర్‌ఎస్సీ వద్ద ఉన్న హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజీల ద్వారా మరింత స్పష్టమైన సమాచారం తెలుస్తుందని కమిషనర్ వివరించారు.