తెలంగాణ

telangana

ETV Bharat / state

మీ దగ్గర భూకంపం వచ్చిందా? - అక్కడ అందరి నోటా ఇదే మాట - EARTHQUAKE IN TELANGANA

ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా రోజంతా ఇదే చర్చ - రిక్టర్‌ స్కేల్‌పై 5.3 తీవ్రత - సురక్షిత చర్యలపై అవగాహన అవసరం -

EARTHQUAKE IN TELANGANA
హనుమకొండలో భూకంప సమయంలో భయంతో బయటకు వచ్చిన ప్రజలు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2024, 7:18 AM IST

Earthquake in Telangana : బుధవారం (నవంబర్ 04) తెల్లవారుజామున అందరి ఇళ్లలోనూ ఒకే పరిస్థితి. ప్రతి ఒక్కరిలో ఆందోళన. భూకంపం గురించే చర్చ. అమ్మో భూకంపం రాత్రి వచ్చి ఉంటే పరిస్థితి ఏంటని భయంతో వణికారు. దీనికి సంబంధించిన వార్తలను కాసేపు ఆన్​లైన్​లో చూశారు. టీవీలో భూకంపం వార్తలు చూస్తూ అతుక్కుపోయారు. భూకంపం వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తు సమయాల్లో సురక్షిత చర్యలపై ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ భారత్​’ ప్రత్యేక కథనం.

మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌ మండలం తహసీల్దార్‌ అయోధ్య రామయ్య ఆరుబయట మంచంపై కూర్చుని టీ తాగుతున్నారు. ఒక్కసారిగా మంచం కదిలింది. ఆలోచిస్తూ రోడ్డుపై వెళుతున్న ట్రాక్టర్‌ వేగం ధాటికేమోనని అనుకున్నారు. ఈలోగా ఆరుబయట స్కూల్​కి వెళ్లడానికి తయారవుతున్న ఆయన నాలుగేళ్ల మనుమరాలు యశ్విత భూమి కంపించిన శబ్దాలకు భయపడింది. ఇంట్లోకి పరుగెత్తి తన తల్లి నవ్యను హత్తుకుంది. ఆ తర్వాత భూకంపం వచ్చిందని తెలిసి ఇంట్లో మొత్తం భయపడ్డారు.

ములుగు జిల్లా ఏటూరునాగారంలో సోమరాజు నిద్రపోతుండగా, వారి వంటింట్లో పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడి దిగ్గున లేచారు. వెళ్లి చూసే సరికి అక్కడ కప్‌బోర్డులో ఉండాల్సిన పాత్రలన్నీ కిందపడి ఉన్నాయి. ఇంట్లో అందరి మొబైల్​ ఫోన్స్​ మోగడం మొదలైంది. అప్పుడు అర్థమైంది వారికి భూకంపం వచ్చిందని.

ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో నేలమట్టమైన సిమెంటు గోడ (ETV Bharat)

ఆ ప్రకృతి బీభత్సమే ఈ భూకంపానికి ముందస్తు హెచ్చరిక :తెలంగాణలోని ప్రముఖవనదేవతల సన్నిధి మేడారం మరోసారి వార్తల్లో నిలిచింది. 2024 ఆగస్టు 31న మేడారం సమీపంలో టోర్నడో ప్రభావంతో 330 హెక్టార్లలో 50 వేలకు పైగా వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఆ ప్రకృతి బీభత్సమే ఈ భూకంపానికి ముందస్తు హెచ్చరిక అని అక్కడి స్థానికులు మాట్లాడుకుంటున్నారు. పర్యావరణవేత్తలు మాత్రం ఆ రెండు సంఘటనలకు సంబంధం లేదని పేర్కొంటున్నారు.

ఇసుక తవ్వకాలు ప్రభావం చూపిందా? :గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా పదేళ్ల క్రితం నుంచి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. భూగర్భ, పర్యావరణ, జలవనరుల శాఖ ఆధీనంలోనే ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇన్నేళ్ల కాలంలో కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తవ్వి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మైనింగ్​ సంపదను సమకూర్చుతున్నా, భవిష్యత్తుకు ఆపదను తెచ్చిపెట్టేదిగా పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లోతుగా ఇసుకను తొలగించడంతో భూమి పొరల్లోకి నీరు ఇంకకపోవడం, భూగర్భజలాలు తగ్గడంతో అది కాస్త పలకల్లో ప్రభావం చూపి కంపించేందుకు వీలు ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

EARTHQUAKE IN MULUGU DISTRICT (ETV Bharat)

మేడారం కేంద్రంగా :భూకంప కేంద్రాన్ని ములుగు జిల్లాలోని మేడారంలో గుర్తించారు.ఇక్కడి నుంచి 225 కిలో మీటర్ల పరిధిలో భూప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయం 7 గంటల 27 నిమిషాలకు రెండు నుంచి నాలుగు సెకన్ల పాటు భూకంప తీవ్రత కనిపించింది. మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ప్రకంపనల దృశ్యాలు సీసీ పుటేజీల్లో నిక్షిప్తమై సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

డోర్నకల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నా. బాత్​రూంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా భూమి కంపించింది. భయంతో బయటకు పరుగెత్తి గట్టిగా కేకలు వేశా. విషయం చెబితే అమ్మ, నాన్న నమ్మలేదు. ఆ తర్వాత వారికి నెమ్మదిగా అసలు విషయం తెలిసింది. - బెన్ని పాల్, స్టూడెంట్, డోర్నకల్‌

భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 5.5 దాటి ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. భూమి కంపించినంత మాత్రాన నష్టం అనేది జరగదు. భూకంపం అనేది భూమి లోపల సహజంగా జరిగే సర్దుబాటు వల్ల వస్తుంది. భూమి పొరల మధ్యలో ఉండే లోపం చాలా కాలం పాటు అలాగే కొనసాగుతుంది. ఎప్పుడో ఒకసారి కొన్ని ‘టెక్టోనిక్‌’ శక్తుల కారణంగా ఆ ప్రాంతం నిండే క్రమంలో భూమి కంపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైన భూకంపాలు సంభవించే అవకాశాలే లేవు. - డా.చింతల శ్రీధర్, ఫిజిక్స్ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, రంగశాయిపేట

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు - మీరు ఈ వీడియోలు చూశారా?

గుజరాత్​లో భూకంపం- రిక్టర్ స్కేల్​పై 3.7తీవ్రత నమోదు

ABOUT THE AUTHOR

...view details