Notice to YCP Leader Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ అందులో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు రావాలని నోటీసులో తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన మూకలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశాయి. దీనిపై తాజాగా కేసు నమోదు కావడంతో ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురాంను ఫలు దఫాలుగా పోలీసులు ప్రశ్నించారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు కొందరిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా దాడి కుట్రలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో అరెస్టు భయంతో సజ్జల ఇప్పటికే కోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ ఉత్తర్వులు విచారణకు అవరోధం కాదని పోలీసులు స్పష్టం చేశారు. సజ్జల విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ముంబయి విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సజ్జలను అడ్డుకోవడంతో లుక్‌అవుట్ నోటీసుల అంశంపై వెలుగులోకి వచ్చింది.