Notices to Beneficiaries to Pay Debt in Wanaparthy :వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఎస్సీకాలనీలోని 125 మంది బీడీ కార్మికులకు 1982లో హైర్-పర్చెస్ పథకం కింద అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. 1985లో ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగించింది. అప్పట్లో ఆ ఇళ్ల నిర్మాణానికి రూ.16,500 ప్రభుత్వం ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.1,500 రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు చెల్లించింది. అవి పోనూ మిగిలిన మొత్తాన్ని ఏడాదికి రూ.18,032 చొప్పున 20 ఏళ్ల పాటు లబ్దిదారులు కిస్తీల కింద చెల్లించాల్సి ఉంది.
నిరుపేదలు, బీడీ కార్మికులైన లబ్దిదారులు తాము చెల్లించలేమంటూ ప్రభుత్వానికి మెురపెట్టుకుంటున్నారు. ఆ బీడి కార్మికులవి రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు. దీనస్థితిలో ఉన్న తాము ఇప్పడికిప్పుడు లక్షలు చెల్లించాలంటే ఎలాగంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. వేల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేయించుకున్నామని తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని చెబుతున్నారు. 42 ఏళ్ల తర్వాత డబ్బులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడంపై మండిపడుతున్నారు. మార్టిగేజ్లో ఉండటంతో మున్సిపాలిటీ సహా ఇతర ప్రభుత్వ సేవలు సైతం ఎస్సీ కాలనీకి అందడం లేదని చెబుతున్నారు.