Wild Cat In Miyapur Metro Station :మియాపూర్ వాసులు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. రాత్రి మెట్రో స్టేషన్ వెనక కలకలం రేపిన జంతువు చిరుత పులి కాదని తేలింది. రాత్రి ఆ ప్రాంతంలో చిరుతపులిని చూశామని కొందరు పంపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఇవాళ ఉదయం అటవీ శాఖ అధికారులు మెట్రోస్టేషన్ సమీపంలోని నడిగడ్డ తండా వద్దకు చేరుకుని ఆ ప్రాంతమంతా పరిశీలించారు. అక్కడ ఉన్న జంతువు పాదముద్రలను గుర్తించారు. అవి అడవి పిల్లి పాదముద్రలుగా తేల్చారు. స్థానికంగా ఎటువంటి చిరుత తిరగలేదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
శుక్రవారం రాత్రి మియాపూర్ మెట్రో స్టేషన్ వెనక భాగంలో నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులు తాము చిరుతను చూశామని ఓ వీడియోను పోలీసులకు పంపారు. అందులో చిత్రాలను పరిశీలించిన పోలీసులు అటవీ శాఖకు సమాచారమిచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా మియాపూర్ ప్రాంతంలోని తండాలు, స్థానిక కాలనీ వాసులను బయటకు రావొద్దని హెచ్చరించడం కలకలం రేపింది. ఇవాళ ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు అవి అడవి పిల్లి పాదముద్రలుగా గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.