Nobel Prize Winner DR Barry Marshall Exclusive Interview :మనం ఎదుర్కొనే అనేక వ్యాధులను అతి తేలికైన జాగ్రత్తలతో తగ్గించుకోవచ్చు. కేవలం చేతులను శుభ్రంగా ఉంచుకుంటే డయేరియా, కలరా, కామెర్లు, టైఫాయిడ్ తదితరాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. మనం తీసుకునే ఆహారం, తాగే నీరు శుద్ధిగా ఉంటే మన ఆరోగ్యమూ అంతే సురక్షితంగా ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. శుభ్రతపై ఏమరుపాటుగా ఉంటే శరీరంపై జబ్బులు దాడి చేస్తాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన హెలికోబ్యాక్టర్ పైలోరీ(HELICOBACTER PYLORI) బ్యాక్టీరియా మన శరీరంలో చేరిపోతుంది. తొలుత కడుపు ఉబ్బరం, పొట్టలో మంట, నోటి దుర్వాసన, గ్యాస్ వంటి లక్షణాలతో సమస్య మొదలు అవుతుంది.
తర్వాత అల్సర్లను సృష్టించి బాధపెడుతూ క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతుంది. దాదాపు 80 శాతం మందిలో దీని లక్షణాలేవీ కనిపించవు. 20 శాతం మందిలోనే తేలికపాటిగా కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు, రక్తం పడుతుందంటే మాత్రం సమస్య తీవ్ర రూపం దాల్చినట్లే. అయితే, దీనికి సమర్థమైన చికిత్స ఉందని అంటున్నారు నోబెల్ పురస్కార గ్రహీత, ఆస్ట్రేలియా వెస్ట్రన్ యూనివర్సిటీ క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బ్యారీ మార్షల్. హైదరాబాద్‌లోని ఏఐజీలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఈనాడు, ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు.
తానే ప్రయోగశాలగా మారి ప్రాణాన్ని పణంగా పెట్టి! : హెచ్ పైలోరీ బ్యాక్టీరియాను తొలిసారి బ్యారీ మార్షలే కనుగొన్నారు. పొట్టలో పూత(Peptic ulcer)కు హెచ్ పైలోరీ బ్యాక్టీరియా కారణమని, దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారి తీస్తుందని తేల్చారు. ఈ అంశంపై బ్యారీ మార్షల్ డాక్టర్ రాబిన్ వారెన్‌తో కలిసి పరిశోధన చేశారు. అయితే ఆయన ఆవిష్కరణను ఎవ్వరూ నమ్మలేదు కదా పెద్దగా కూడా పట్టించుకోలేదు. ఈ సందర్భంలో శాస్త్రవేత్తలు ఎవరైనా మొదట జంతువులపై ప్రయోగాలు చేస్తారు. వాటి ఫలితాలతో అధ్యయన నివేదికలు రూపొందిస్తారు. కానీ, మార్షల్ మాత్రం తన శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారు. తానే స్వయంగా ఈ రకం బ్యాక్టీరియాను తీసుకున్నారు. 5 రోజుల తర్వాత వ్యాధి బారిన పడ్డారు. వాంతులు, వికారం, నోటి దుర్వాసన వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దాంతో బయాప్సీ చేస్తే తన జీర్ణాశయంలో హెచ్ పైలోరీ (H Pylori) అనే రకం బ్యాక్టీరియా ఉన్నట్లుగా తేలింది. ఇందుకు ఆయన చికిత్స పొంది తిరిగి కోలుకున్నారు. ఈ ఆవిష్కరణకే ప్రొఫెసర్ బ్యారీ మార్షల్‌కు 2005లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది.
‘హెచ్ పైలోరీ’ చికిత్సలో ఏమైనా పురోగతి సాధించామా భారత్‌పై దీని ప్రభావం ఎలా ఉంది? :జీర్ణాశయంలో అల్సర్లకు ఆమ్లాలు కారణమని మొదట్లో భావించేవారు. తర్వాత హెచ్ పైలోరీ బ్యాక్టీరియా కారణమని తేలింది. ఈ రకం బ్యాక్టీరియా మన జీర్ణాశయం అంతర్గత గోడల ఉపరితలంలో ఉండే జిగురు పొరలను అతుక్కుని ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉనికిని శ్వాస, మల, రక్త పరీక్షలు (Blood Test), ఎండోస్కోపీ పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. రెండు వారాల పాటు యాంటీ బయాటిక్స్‌తో చికిత్స అందిస్తే సరిపోతుంది. చికిత్స తర్వాత పూర్తిగా నయమైందా? లేదా? అని తెలుసుకోవడానికి మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సిందే!
భారత్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో పాటు ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోనూ ఎక్కువ మంది ఈ రకం బ్యాక్టీరియాతో బాధపడుతున్నారు. భారత్‌లో డయాబెటిక్ పేషెంట్స్ సంఖ్య కంటే పదింతలు అధికంగా బాధితులు ఉంటారని నిపుణుల అంచనా. ఈ వ్యాధికి సంబంధించి స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడు యోగర్ట్ లేదా పెరుగు (Yogurt or Curd) వంటి ప్రోబయాటిక్స్ వాడితే కొంత వరకు ఉపశమనంగా ఉంటుంది. వ్యాధి పూర్తిగా నయం అవ్వాలంటే మాత్రం యాంటీబయాటిక్స్ వాడాల్సిందే.
ఒకరి నుంచి ఒకరికి ఎలా సోకుతుంది?నోట్లోని లాలాజలం ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరికి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే అందరికీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి నుంచి చిన్నారులకు, ఇతర కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉంది. తల్లి పొట్టలో ఉన్న హెచ్ పైలోరీ (H Pylori) బ్యాక్టీరియా ఆమె నోట్లోని లాలాజలంలోకి (Saliva) చేరుతుంది. ఆమె తన చేతులను నోటి దగ్గర తుడుచుకొని అవే చేతులతో పిల్లలను తాకినప్పుడు వారికి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా చేరుతుంది. ఆమె చేతుల్లోని ఆహారం ద్వారా కూడా తమ పిల్లలకు చేరుతుంది.
ఇది కొందరిలోనే ప్రమాదకరంగా మారడానికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా?హెచ్ పైలోరీ అందరిలోనూ తీవ్ర ప్రభావం చూపించదు. ఈ అంశంపై ఇక పరిశోధనలు జరుగుతున్నాయి. జనాభాలోని 20% మందిలోనే అల్సర్లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా జీర్ణాశయంలోని పై పొర ఉపరితలంపై ఉండి, అక్కడి జిగురు వ్యవస్థను దెబ్బ తీస్తుంది. జబ్బు తీవ్రమయ్యే వరకు గుర్తించలేకపోతే అందుకు చికిత్స కూడా కష్టమవుతుంది.