No Water in Handri Neeva Canal :సోమవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి తన అధికార బలంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. కుప్పానికి హంద్రీ నీవా జలాలను విడుదల చేసిన జగన్, ప్రత్యేక జల పూజలు చేశారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తరలించామని జగన్ వెల్లడించారు. ప్రస్తుతం చూస్తే కాలువలో నీళ్లు ఆగిపోయాయి. ఎందుకిలా ఆగిపోయా అని గ్రామస్థులు ఆరా తీస్తే ఇది కేవలం ఎన్నికల స్టంట్‌కు ఉపయోగించిన 'సినిమా సెట్టింగ్' అని తెలిసి ముక్కున వేలు వేసుకున్నారు.
కుప్పం నియోజకవర్గాన్ని ఉద్ధరించింది తానేనంటూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన గొప్పలు ఉత్తిదేనని తేలిపోయింది. సోమవారం ఆర్భాటంగా కృష్ణా జలాలను విడుదల చేసిన జగన్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చామంటూ ఊదరగొట్టేశారు. వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కాలువకు అడ్డుకట్ట వేసి మరీ నిల్వ చేసిన జలాలను సీఎం విడుదల చేసి ఫొటోలకు తెగ ఫోజులిచ్చారు.
రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం సీఎం నీళ్లు విడుదల చేసిన చోట ఇవాళ పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి గొప్పల కోసం ఏర్పాటు చేసిన గేట్లను కూడా పొక్లెయిన్ సహాయంతో అధికారులు తొలగించారు. సీఎం వచ్చి వెళ్లిన ఒక్కరోజుకే నీటి విడుదల కూడా ఆపేసిన ప్రభుత్వం 110 చెరువులను ఎలా నింపుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కుప్పంలో హంద్రీ-నీవా జలాలను విడుదల చేసిన సీఎం జగన్
Water Allocation as Election Drama :ఎన్నికల స్టంట్‌గా హంద్రీనీవా జలాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన మరుసటి రోజున మంగళవారం హంద్రీనీవా కాలువ బోసిపోయిన దృశ్యాలను స్థానిక తెలుగుదేశం నాయకులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో(Social Media) పోస్ట్ చేస్తున్నారు.