తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మళ్లీ నిరాశే - ప్రత్యేకంగా ఏదీ రాలేదు - TELANGANA CENTRAL BUDGET

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకురాని నిధులు - రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలు పట్టించుకోని కేంద్రం.

Central Budget 2025-26
Telangana Central Budget 2025 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2025, 7:16 AM IST

Updated : Feb 2, 2025, 7:33 AM IST

Telangana Central Budget 2025-26 :కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏది రాలేదు. బడ్జెట్​లో ఈసారైనా రాష్ట్రానికి అదనపు నిధులు దక్కుతాయని, తగిన తోడ్పాటు లభిస్తుందని ప్రభుత్వం ఆశించగా నిరాశే మిగిలింది. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర నిధులు మినహా అదనంగా ఏమీ కేటాయించలేదు.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మళ్లీ నిరాశే :కేంద్ర బడ్జెట్​పై భారీ అంచనాలు పెట్టుకున్న రాష్ట్రానికి నిరాశే మిగిలింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయిస్తుందన్న విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూసింది. విభజన చట్టంలోని పెండింగ్ హామీలతో పాటు కొత్త ప్రాజెక్టులకు తగిన నిధులు ఇస్తారని ఆశలు పెట్టుకొంది. కొత్త ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.1.63 లక్షల కోట్లు అవసరమని పలు సందర్భాల్లో కేంద్రానికి నివేదికలు, వినతిపత్రాలు సమర్పించింది. ప్రాంతీయ రింగురోడ్డు, పది కొత్త గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల అభివృద్ధి, మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్, గోదావరి, మూసీ నదుల అనుసంధానం, హైదరాబాద్ అభివృద్ధి, నగరంలో సీవరేజీ మాస్టర్ ప్లాన్​తో పాటు వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరింది.

రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలు పట్టించుకోని కేంద్రం :బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డ్రై పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ రోడ్డును మంజూరు చేయాలని, హైదరాబాద్​లో సెమీకండక్టర్ మిషన్​ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బ‌య్యారం ఉక్కు పరిశ్రమ, కొత్త రైల్వే లైన్లు, జాతీయ ర‌హ‌దారులు, ఇతరత్రాలకు నిధులను కేటాయించాలని కోరింది. తెలంగాణకు రావాల్సిన ప‌న్నుల వాటా, కేంద్ర ప్రత్యేక పథకాల గ్రాంట్ల విష‌యంలో రాష్ట్రానికి ప్రతీసారి అన్యాయమే జరుగుతోందని ఈ సారైనా న్యాయం చేస్తారని ఆశలు పెట్టుకొంది. కేంద్ర బడ్జెట్​పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన వాటా, నిధులు తప్ప ఎలాంటి ఇతర కేటాయింపులు లేవు. విభజన చట్టం హామీలు సహా ఎలాంటి ప్రత్యేక ప్రస్తావన ఊసేలేదు.

కేంద్ర పన్నుల్లో వాటాగా : కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.29,899 కోట్లు వస్తాయని బడ్జెట్​లో పేర్కొన్నారు. ‍మొత్తం రూ.14,22,444 కోట్లలో రాష్ట్ర వాటా అయిన 2.104 శాతం ప్రకారం ఈ మొత్తం వస్తుంది. కార్పొరేట్ పన్నులో రూ. 8,349 కోట్లు, ఆదాయపన్ను వాటాగా రూ. 11,140 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ నుంచి రూ.8704 కోట్లు, కస్టమ్స్ ద్వారా రూ.376 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ సుంకం నుంచి రూ.285 కోట్లు రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వస్తాయి.

కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 2024-25 లో రూ.26,216 కోట్లు ప్రతిపాదించి రూ.27,050 కోట్లకు అంచనాలను సవరించారు. వచ్చే ఏడాది రూ.3000 కోట్లు అదనంగా రానున్నాయి. ఇక ఎన్డీఎంఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇతర గ్రాంట్లు - నిధులు, స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు, వైద్య, ఎస్డీఆర్ఎఫ్ నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 2025-26 లో రాష్ట్రానికి మరో రూ.30 వేల కోట్లకు పైగా వస్తాయని అంచనా.

పరోక్ష ప్రయోజనాలు : తాజా బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సూక్ష్మ పరిశీలన చేశారు. ఏ శాఖ ద్వారా కూడా తెలంగాణ ప్రత్యక్ష ప్రయోజనాలు పొందే పథకాలు, కార్యక్రమాలు కనిపించలేదు. పరోక్ష ప్రయోజనాలను అన్వేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు.

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి దక్కని కొత్త ప్రాజెక్టులు, నిధులు!

కేంద్ర బడ్జెట్​తో మనకెంత లాభం? - మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

Last Updated : Feb 2, 2025, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details