NO Special APSRTC Buses For Voters :జగన్ సిద్ధం సభలు అనగానే వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు మాత్రం ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా ''వాళ్లచావు వాళ్లు చావని'' అనేలా వదిలేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని ఏపీకి చెందిన వారంతా ఓటేసేందుకు తప్పకుండా సొంతూళ్లకు వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే అయినా డీజీపీ ర్యాంక్ అధికారి అయిన ఆర్టీసీ ఎండీకి మాత్రం ఎందుకు తెలియలేదనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సుల్లో సీట్లన్నీ ముందే బుక్ కావడంతో మరిన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకుండా ఆర్టీసీ అధికారులు చోద్యం చూశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Andhra Pradesh Election 2024 :సంక్రాంతికి ఊళ్లకి వచ్చేవారి కోసం రెగ్యులర్ బస్సులు కాకుండా ఏటా దాదాపు 4 వేల వరకు ప్రత్యేక బస్సులు, అదే సంఖ్యలో తిరుగు ప్రయాణం కోసం అందుబాటులో ఉంచుతారు. ఎన్నికల సమయంలో కూడా దాదాపు అంతే రద్దీ ఉంటుంది. పైగా సోమవారం పోలింగ్ జరగనుండగా శని, ఆదివారాలు వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో రద్దీ అధికంగా ఉంటుందనే కనీస అంచనా కూడా వేయలేకపోయారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా శుక్ర, శనివారాల్లో రోజుకు 300 చొప్పున మాత్రమే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం 205 బస్సులే సిద్ధం చేశారు. దీంతో అవి ఏమాత్రం సరిపోవడం లేదు.
ఏపీకి 'ఓటెత్తిన' పౌరులు- రహదారులు కిటకిట - Bus Stands rush with AP voters