No New Railway Projects To Telangana : బడ్జెట్‌లో కేటాయింపుల్లో తెలంగాణకు కొత్తగా ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా మంజూరు కాలేదు. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం దిల్లీలో రాష్ట్రానికి కేటాయింపుల వివరాలను వెల్లడించారు. ఈ కేటాయింపుల్లో గత ఏడాదితో పోలిస్తే అదనంగా రూ.కోటి మాత్రమే పెరిగింది. 2024-25లో రైల్వే పద్దు కింద రూ.5,336 కోట్లు కేటాయిస్తే 2025-26లో ఆ మొత్తం రూ.5,337 కోట్లు. కాగా బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగితేనే ఆయా ప్రాజెక్టులకు అధిక నిధులు వస్తాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సైతం నిధుల కేటాయింపులు భారీగా పెరిగిన పరిస్థితి కనిపించడం లేదు.
యాదాద్రి ఎంఎంటీఎస్ పట్టాలెక్కేనా? : ఘట్‌కేసర్-రాయగిరి(యాదాద్రి) ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పట్టాలెక్కేలా లేదు. 2025-26 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించలేదు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ వాటాతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని ఏడాది క్రితమే రైల్వేశాఖ తెలిపింది.
సంవత్సర కాలంలో డీపీఆర్ సిద్ధం చేశారు కానీ రైల్వేబోర్డుకు పంపడం, ఆమోదించి నిధులు మంజూరుచేసే ప్రక్రియలో రైల్వేశాఖ జాప్యం చేసింది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే యాదాద్రికి వెళ్లే భక్తులకు ఎంఎంటీఎస్ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఏడెనిమిదేళ్లుగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలోనే ఉంది. రూ.650 కోట్లతో యాదాద్రి ఎంఎంటీఎస్ నిర్మాణం పూర్తవుతుంది.