No Electricity Charges Hike in Telangana :ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాన్యులపై ఎటువంటి విద్యుత్ ఛార్జీల భారం ఉండబోదని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (Electricity Regulatory Commission) ఛైర్మన్ శ్రీరంగారావు స్పష్టం చేశారు. 2024-25 సంవత్సరానికి డిస్కంలు, జెన్-కో, ట్రాన్స్-కో వేసిన పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించింది. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులతో పాటు వినియోగదారుల పరిస్థితులు, ప్రభుత్వ సబ్సిడీ తదితర అంశాలను క్రోడీకరించుకుని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
డిస్కంలు 57 వేల 728.90 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపితే 54 వేల 183.28 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ గ్యాప్ 13 వేల 22.25 కోట్ల రూపాయలుగా ఉందని, దాన్ని భర్తీ చేసుకునేలా అనుమతి ఇవ్వాలని డిస్కంలు కోరాయి. అయితే కమిషన్ కేవలం 11 వేల 156.41 కోట్ల రూపాయలకు మాత్రమే ఆమోదం తెలిపింది. సిరిసిల్ల సెస్ రెవెన్యూ గ్యాప్ 494.95 కోట్ల రూపాయలుగా ఉందని, దాన్ని పూడ్చేందుకు అనమతి ఇవ్వాలని కోరగా కమిషన్ 343.11 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది. ఎస్పీడీసీఎల్కు (Southern Power Distribution Company of Telangana Ltd) 4 వేల 15 కోట్ల రూపాయలు, ఎన్పీడీసీఎల్కు (Northern Power Distribution Company of Telangana Ltd) 7 వేల 141 కోట్ల రూపాయలు, సిరిసిల్ల సెస్‌కు 343.11 కోట్ల రూపాయలు రెవెన్యూ గ్యాప్ ఉందని ఆ మొత్తంతో పాటు ఛార్జీలు కలిపితే మొత్తం రెవెన్యూ గ్యాప్ ఉన్నట్లు డిస్కంలు కమిషన్‌కు నివేదించాయి.
ఇంధన సర్దుబాటు ఛార్జీల పాపం జగన్‌దే: మంత్రి గొట్టిపాటి రవికుమార్
65 రూపాయల నుంచి 50కి తగ్గింపు :ఎల్టీ గృహ వినియోగదారులకు ఒకవేయి 699.45 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగానికి 9 వేల 800.07 కోట్ల రూపాయలు మొత్తం కలిపి 11 వేల 499.52 కోట్ల రూపాయల సబ్సిడీని, రెవెన్యూ గ్యాప్‌ను ప్రభుత్వం రాయితీ రూపంలో చెల్లించనున్నట్లు కమిషన్ తెలిపింది. గత ఏడాదితో పోల్చుకుంటే ప్రభుత్వ సబ్సిడీ 2 వేల 374.7 కోట్ల రూపాయలకు పెంచిందని, అది 26 శాతం అధికమని కమిషన్ వెల్లడించింది. మొత్తంగా డిస్కంలు 0.47% టారిఫ్‌ను పెంచుకునేందుకు కమిషన్ అనుమతినిచ్చింది. వాస్తవానికి వివిధ వర్గాలకు డిస్కంలు 12 వందల కోట్ల రూపాయల ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతినివ్వాలని కోరగా అందులో 11 వందల 70 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అదిపోగా మరో 30 కోట్ల రూపాయల భారం పడనుంది. అందులో 800 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించే వారిపై మాత్రమే భారం పడనుంది.