Nizamabad Youth Successful Story of Govt Jobs : శ్రమ నీ ఆయుధం అయితే, విజయం నీ బానిస అవుతుందని తలచారు ఈ యువకులు. ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా ప్రణాళికలు రచించుకున్నారు. అందుకోసం అనుక్షణం కష్టపడ్డారు. ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాల్లో ఒకరు 3 ఉద్యోగాలు సాధిస్తే, మరొకరు 4 ఉద్యోగాలకు ఎంపికయ్యారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సిరిపురం సురేందర్, అంబీరు మధుసూదన్ రావు.
సిరిపురం సురేందర్‌ది నిజామాబాద్ జిల్లా గోవింద్‌పేట్ గ్రామం. తల్లిదండ్రులు సాయన్న, లక్ష్మి వ్యవసాయ కూలీలు. బాల్యం నుంచి తల్లిదండ్రుల కష్టాలను కళ్లారా చూసిన ఈ యువకుడు, వ్యవసాయ పనులు(Agricultural works) చేసి, వచ్చిన డబ్బుతో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, గ్రేటర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఎడ్ పూర్తి చేశాడు సురేందర్. కుటుంబ పరిస్థితుల కారణంగా ఉదయాన్నే పేపర్ వేస్తూ, వీలున్నప్పుడు క్యాటరింగ్ పనులు చేస్తూ చదువుకునేవాడు.
అయినవాళ్లు లేకున్నా అనుకున్నది సాధించాడు - 10 ఏళ్లు కష్టపడి 4 సర్కార్ కొలువులు కొట్టేశాడు
మూడేళ్ల నిరీక్షణకు నాలుగు జాబుల ప్రతిఫలం: ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించడమే లక్ష్యంగా 3 సంవత్సరాలు కష్టపడ్డానని చెబుతున్నాడు సురేందర్. ఇటీవల విడుదలైన గురుకుల ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డిగ్రీ లెక్చరర్(Degree Lecturer) కొలువులకు ఎంపికయ్యాడు సురేందర్. డిగ్రీ లెక్చరర్‌గా ఉద్యోగం చేయడంపైనే ఆసక్తి ఉందని చెబుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నందుకు కుటుంబసభ్యులంతా సంతోషంగా ఉన్నారని అంటున్నాడు.
"ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంది. మాకు సొంతంగా వ్యవసాయ భూమి లేకున్నా, అమ్మ వ్యవసాయ కూలీగా, నాన్న కౌలు రైతుగా ఉంటూ, ఇంటిని నడిపేవారు. ఒకప్పుడు మా అక్కను చదివిద్దామనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితులు బాగా లేక పోవడంతో అది కుదరలేదు. అటువంటి పరిస్థితి నాకు, అన్నయ్యకు రాకూడదనే బాగా చదివించారు."-సిరిపురం సురేందర్, 4 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువకుడు
Youth Effort in Govt Job :ఇక అంబీరు మధుసూదన్‌రావుది కామారెడ్డి జిల్లా సంగోజివాడి స్వస్థలం. తల్లిదండ్రులు కిషన్‌రావు, మోనాబాయిలు. వీరిది కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబమే.తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసిన మధుసుదన్‌రావు, 2014 నుంచి 2023 వరకు పలు ప్రైవేట్ కళాశాలల్లో అధ్యాపకుడిగా పని చేశాడు. కరోనా సమయంలో ప్రైవేటు ఉద్యోగులు(Private Employees) పడిన కష్టాలను ఈ యువకుడు కళ్లారా చూశాడు.