Nizamabad Teacher Arranges Maths Practical Lab In School :విద్యార్థులకు లెక్కలంటే చెప్పలేనంత భయం. గణితం కఠినంగా ఉంటుందని అన్ని సబ్జెక్టుల్లో కెల్లా అదే కష్టమైందన్న భావన వారి మనసుల్లో బలంగా నాటుకుపోయింది. అలాంటి భయాన్ని పటాపంచలు చేస్తూ లెక్కల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా గణిత ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ల్యాబ్ ద్వారా చిట్టి బుర్రలకు సైతం సూత్రాలు అర్థమయ్యేలా గణిత పాఠాలు బోధిస్తున్నారు.
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా పాఠాలు నేర్పించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ల్యాబ‌్లు ఉన్నాయి. గణిత ప్రయోగశాలలు మాత్రం అరుదు. కానీ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. పాఠశాల పూర్వ విద్యార్థి కృష్ణారెడ్డి సహకారం, గణిత ఉపాధ్యాయుడు సాయిలు కృషితో ల్యాబ్ ఏర్పాటైంది. ఈ ప్రయోగశాల ఏర్పాటుతో గతంలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన అనేక మంది విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలకు రావడం ప్రారంభించారు.
ఆ మా'స్టారు' ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు -నేటి ఉపాధ్యాయలోకానికి ఆయనో దిక్సూచి - Special Story On Nizamabad Teacher
"మొట్టమొదటి గణిత ల్యాబ్ నిజామాబాద్‌లోని మా పాఠశాలలో ఏర్పాటైంది అని చెప్పుకోడానికి ఆనందంగా ఉంది. చాలా పరికరాలు, సౌకర్యాలతో ఈ ల్యాబ్ ఏర్పాటు చేశాం. పిల్లలు గణితం అంటేనే భయపడతారు. కానీ ఇక్కడ ఉన్న పరికరాలతో గణితాన్ని సులువుగా నేర్పిస్తున్నాం. తెలియని విషయాలను కళ్లకు కట్టినట్లు చెప్తున్నాం." - సాయిలు, గణితం ఉపాధ్యాయుడు
యూట్యూబ్‌లో సైతం పాఠాలు :పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రయోగశాల జిల్లాలోని అన్ని స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రయోగశాలలో క్షేత్రమితి, రేఖాగణితం, సంఖ్యారేఖకు సంబంధించిన పరికరాలను సమకూర్చారు. వీటి ద్వారా గణితం ఉపాధ్యాయుడు సాయిలు విద్యార్థులకు వైవిధ్య రీతిలో సులువుగా అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో మ్యాథ్స్‌ల్యాబ్ ఏర్పాటుతో విద్యార్థులు కఠినమైన సూత్రాలను సైతం సులువుగా నేర్చుకుంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇందుకోసం సొంతంగా తయారు చేసిన చార్టుల సాయంతో పాఠాలను యూట్యూబ్‌లో సైతం పొందుపర్చారు. విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరిస్తేనే మ్యాథ్స్‌పై ఆసక్తి పెరుగుతుందని గణిత ఉపాధ్యాయుడు సాయిలు చెబుతున్నారు.
ప్రాక్టికల్‌గా చూపెట్టడం ద్వారానే :ఇంతకు ముందు ప్రైవేటు పాఠశాలల బాట పట్టిన విద్యార్థులు సైతం ఈ గణితం ప్రయోగశాల ఏర్పాటుతో తిరిగి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గణితం అంటేనే భయపడ్డ విద్యార్థులు ఇప్పుడు ప్రయోగాత్మకంగా నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాఠాలు చెప్పడం కంటే ప్రాక్టికల్‌గా చూపెట్టడం ద్వారానే గణితం అర్థమవుతుందని విద్యార్థులు చెబుతున్నారు. ప్రత్యేక తరగతులు తీసుకుని లెక్కలపై తమ భయాన్ని ఉపాధ్యాయులు పోగొడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. డీఈవో సహకారంతో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ ప్రయోగశాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులతో ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు ఇలాంటి ప్రయోగశాలను తమ పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు.
మేడం సార్ మేడం అంతే - ఈ లెక్కల టీచర్ పాఠాలు చెప్పే లెక్కే వేరు - HAPPY TEACHERS DAY 2024
ఈ మాస్టారు పాఠం చెబితే రాళ్లయైన కరగాల్సిందే - కలాం డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్‌తో పిల్లలకు చేయూత - physics Teacher Sridhar teaching