Nizam College Students Protest For Hostel Facilitiy :బషీర్ బాగ్‌లోని నిజాం కళాశాలలో పీజీ విద్యార్థినులకు హాస్టల్ కేటాయింపు వివాదం రోజురోజుకు ముదురుతోంది. యూజీ విద్యార్థులకు కాకుండా పీజీ విద్యార్థినులకు హాస్టల్ కేటాయిస్తే ఊరుకునేది లేదంటున్న విద్యార్థినులు ఇవాళ రోజంతా ఆందోళన కొనసాగించారు. ప్రిన్సిపల్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అర్థరాత్రి అవుతున్నా తమ పోరాటం కొనసాగిస్తున్నారు. కాలేజీ ప్రిన్సిపల్ తమ డిమాండ్లను పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థినిలకు 50%, పీజీ విద్యార్థినులకు 50% కేటాయిస్తామని సర్కులర్ విడుదల చేశారని విద్యార్థులు మండిపడ్డారు.
ప్రిన్సిపల్ తీరును నిరసిస్తూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత 5 రోజులుగా పోరాటం చేస్తున్నా కూడా ప్రిన్సిపల్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు మండిపడుతున్నారు. సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే రేపు కాలేజీ ఆవరణలో వంటావార్పు చేపడతామని వారు హెచ్చరించారు. పీజీ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యం ఉందని, డిగ్రీ విద్యార్థులకు నిజాం కాలేజీ వసతి గృహంలోనే పూర్తి స్థాయిలో కేటాయించాలని అప్పటి వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.