Nine Members Died Due to Diarrhea in Vijayawada :ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు మంచాన పడ్డారు. ఇంటికొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఏ ఇంట్లో చూసినా మూడు నాలుగు రోజులుగా విరోచనాలతో బాధపడే వారే కనపడుతున్నారు. ఇదీ విజయవాడని దుస్థితి. రోజువారీ కూలీలు, పేదలు, అసంఘటిత రంగ కార్మికులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో అతిసారం విజృంభిస్తున్నా అధికారులకు మాత్రం చీమకుట్టినట్లైనా అనిపించడం లేదు. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో కనీసం వైద్య శిబిరాలూ నిర్వహించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. అతిసారం బారిన పడి ఇప్పటికే 9 మంది మృతి చెందినా వైద్యారోగ్య శాఖ మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 250 మంది రక్తనమూనాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నా ఇంతవరకూ ఒక్కదాని ఫలితాన్నీ ప్రకటించలేదు. మృతుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించ లేదు. అతిసార వేగంగా విస్తరిస్తున్న వీఎమ్సీ యంత్రాంగం కనీసం నియంత్రణ చర్యలు చేపట్టలేదని బాధితుల బంధువులు విమర్శిస్తున్నారు.
కలుషిత నీటి కాటు.. వాంతులు, విరేచనాలతో జనం బెంబేలు..
విజయవాడలోని మొగల్రాజపురంలో సరఫరా చేసిన నీటిలో నైట్రేట్లు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. మొగల్రాజపురంలో వాంతులు, విరేచనాలతో గల్లా కోటేశ్వరరావు(60) మృతి చెందారు. ఇక్కడ నీటిని క్లోరినేషన్ చేసిన వెంటనే సరఫరా చేశారని, అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బోర్లు వేసిన ప్రాంతాలు సైతం సురక్షితమైనవి కావని తేల్చారు. మరోవైపు నీటి నమూనాలను పరీక్షించాల్సిన ప్రాంతీయ, జిల్లా ప్రజారోగ్య ప్రయోగశాలలు, నీటి పరీక్షా కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి.