Nanoven Covers Making in karimnagar :ఆర్థికష్టాలు బాధిస్తున్నా, భవిష్యత్తును చీకట్లు కమ్మేస్తున్నాయని భయపడిపోలేదు ఈ యువకుడు. ఎలాగైనా అప్పుల ఊబిలోంచి కుటుంబాన్ని బయటపడేయాలని ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాడు. తనకీ, సమాజానికి ఉపయోగపడే ఓ చక్కని పరిష్కారం కనుగొన్నాడు. నానోవెన్ కవర్ల తయారీకి శ్రీకారం చుట్టి, సొంతూళ్లోనే మంచి ఆదాయం గడిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌కు చెందిన ఈ యువకుడి పేరు వేల్పులు నిఖిల్ కుమార్. 2017లో బీటెక్ పూర్తయ్యేసరికే కుటుంబం అప్పుల బాధలో మునిగిపోయింది.
సైట్ ఇంజినీర్‌గా ఉద్యోగం : తండ్రి ప్రభాకర్ సంపాదన అంతంతమాత్రమే. తల్లి కుట్టుపని చేస్తున్నా ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో పైచదువులకు వెళ్లాలనే ఆశలు వదిలేసుకున్నాడు నిఖిల్. కుటుంబానికి ఆసరాగా ఉండాలని కరీంనగర్‌లోని ఓ కంపెనీలో, సైట్ ఇంజినీర్‌గా చేరాడు. సైట్ ఇంజినీర్‌గా రోజంతా కష్టపడినా, నిఖిల్‌కు 15 వేల వేతనమే దక్కేది. ఆ కాస్త ఆదాయంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేక సతమతమయ్యాడు.
పలకరించిన నష్టాలు : ఉద్యోగంలోనూ పని ఒత్తిడి ఎక్కువవడంతో, ఈ సమస్యకు శాశ్వతపరిష్కారం కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. ఇంట్లో వాళ్లతో చర్చించి, నానోవెన్ కవర్ల తయారీ ప్రారంభించాడు. ఎన్నోఆశలతో వ్యాపారం మొదలుపెట్టిన నిఖిల్‌ను, మొదటి 6 నెలలు నష్టాలే పలకరించాయి. ఊళ్లో ప్లాస్టిక్ కవర్ల వాడకం అధికంగా ఉండటంతో, నానోవెన్ కవర్లు కొనేవారే కరవయ్యారు. దీంతో మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఊళ్లో ప్లాస్టిక్ వాడకం తగ్గేలా చూశాడు.
లాభాల బాట : క్రమంగా వ్యాపారం పుంజుకుంది. ఇప్పుడు అన్ని ఖర్చులూ పోను నెలకు 50వేల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తోందని అంటున్నాడు నిఖిల్. మధురైకి వెళ్లి నానోవెన్ కవర్ల తయారీ విధానం గురించి నేర్చుకున్నానని చెబుతున్నాడు నిఖిల్. మొదట్లో మధురైలోనే ముడిసరకును కొనుగోలు చేసేవాళ్లమని, ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటున్నామని అంటున్నాడు. తనకే కాక తోటివారికీ మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారం మొదలుపెట్టాడు నిఖిల్.