New year 2025 Celebrations in Ramoji Film City : గడిచిన ఏడాది జ్ఞాపకాలను గర్తుకుచేసుకుంటూ నూతన సంవత్సరానికి రామోజీ ఫిల్మ్‌సిటీ కొంగొత్తగా స్వాగతం పలికింది. 2024కు వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు వచ్చిన సందర్శకులను ఫిల్మ్‌సిటీ అందాలు కట్టిపడేశాయి. చిత్రనగరి అందాలను తిలకించేందుకు వచ్చిన సందర్శకులకు మరిచిపోలేని జ్ఞాపకాలు అందించింది. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే క్షణాలను ఆనందిస్తూ పర్యాటకులు పసందైన విందును ఆస్వాదించారు. మరచిపోలేని మధురానుభూతులతో కలల లోకంలో విహరించారు. విభిన్న వినోద కార్యక్రమాలతో రామోజీ ఫిల్మ్‌సిటీ పర్యాటకులను ఓలలాడించింది.
దేశంలోనే నంబర్ వన్ డీజేగా పేరొందిన డీజే చేతస్ తన ప్రదర్శనతో పర్యాటకుల్ని ఉర్రూతలూగించారు. డీజే వేదికపై బాలీవుడ్ గీతాలాపన, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశాన్నంటే సందడి మధ్య వీక్షకులు న్యూ ఇయర్ వేడుకని ఘనంగా జరుపుకున్నారు. లైవ్ బ్యాండ్ జోరుతో ఉత్తేజకరమైన వినోదం కలగలిసి సంబురాలు మిన్నంటాయి. నృత్య ప్రదర్శనలు, ఫైర్ యాక్షన్లు, స్టాండప్ కామెడీ షో, జంగిల్ థీమ్ అక్రోబ్యాటిక్ స్టంట్, క్లౌన్, లయన్ కింగ్, స్క్విడ్ గేమ్స్ ఇలా క్షణం తీరిక లేకుండా పర్యాటకులు మధురానుభూతిని పొందారు.