New Year 2025 in AP : నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కటింగ్‌లు, టపాసుల మోతలు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2025కి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటల వరకూ రోడ్లపై షికార్లు చేసిన కుర్రకారు క్యాలెండర్లో తేదీ మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వీధుల్లో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగరాల నుంచి మొదలుకొని పట్టణాలు, గ్రామాల వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. కొత్త ఏడాదికి స్వాగతమంటూ సంబరాలు చేసుకున్నారు.
అనంతపురం టవర్ క్లాక్ వద్ద టపాసులు పేల్చి నృత్యాలు చేశారు. ఈలలు వేశారు. కేకులు కట‌్ చేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కర్నూలు రాజ్‌విహార్ కూడలికి పెద్ద సంఖ్యలో చేరుకున్న యువకులు రోడ్లపై వెళ్లే వారికి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలోని పోలీసు బృందాలు అర్ధరాత్రి దాటాక యువతను ఎక్కువసేపు రోడ్డుపై ఉండనివ్వకుండా పంపేశారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో యువత కోలాహలంగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
తిరుపతి ప్రజలు ఉరిమే ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతమంటూ సంబరాలు చేసుకున్నారు. ఆటపాటలతో 2025కి అదిరే ఆరంభమిచ్చారు. ఇక తిరుమల కొండపై భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వేల మంది భక్తులు శ్రీవారి ఆలయం ఎదుట గుమిగూడి నూతన ఏడాదికి ఆహ్వానం పలికారు. గుంటూరులోనూ వేడుకలు అంబరాన్నంటాయి. కమ్మజన సేవా సమితి హాస్టల్‌లో విద్యార్థులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సినిమా పాటలకు స్టెప్పులేశారు.