New Traffic Rules in Telangana From Today :రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, తాగి డ్రైవింగ్ చేయడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తి స్థాయి ఫలితాలు కనిపించడం లేదు. అందులో భాంగంగా, కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన రహదారి నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
మద్యం మత్తులో, ఇష్టారీతిన వాహనాలు నడపడం, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు కుటుంబాలకు చేదు జ్ఞాపకాలు మిగుల్చుతున్నాయి. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు(మైనర్లు) వాహనాలు ఇవ్వడం ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగితే అందరూ రెండు రోజులు హడావుడి చేసి మర్చిపోతారు. కన్నవారు, కట్టుకున్న వారికి మాత్రం జీవితాంతం చేదు జ్ఞాపకమే మిగులుతోంది. ఇలాంటి వాటి కట్టడికి నిబంధనలు కఠినతరం కానున్నాయి.
మారిన ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. బాలల చేతుల్లో మారణాయుధాలుగా మారుతున్న వాహనాలను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరమని అన్నారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.
మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేల జరిమానాతో విధిస్తారు. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు ఉంటాయి. అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపినా, పరిమితికి మించి ప్రయాణించినా, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా, రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు జరిమానా వేయనున్నారు.