Bhu Bharati Act :కొత్త రెవెన్యూ చట్టం భూ భారతి జనవరి 9న రూపుదాల్చింది. ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. ఓవైపు దాని అమలుకు విధి విధానాలు రూపొందిస్తుండగా, మరోవైపు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో సాఫ్ట్‌వేర్ నిపుణులు చట్టానికి కొత్త సాంకేతిక రూపం ఇస్తున్నారు. ఈ కొత్త సాంకేతికతలో మండల స్థాయి నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ వరకు అన్ని అంచెల్లో ఆప్షన్‌లు మొదలు అవసరమైన అంశాలను సాఫ్ట్‌వేర్‌కు జోడిస్తున్నారు. ఈ చట్టానికి సంబంధించిన అంశాలను న్యాయ నిపుణులు సునీల్ పర్యవేక్షిస్తుండగా, ధరణిలోని 33 మాడ్యూళ్లను ఆరుకు కుదించగా, పలు కొత్త ఆప్షన్‌లను చేర్చుతున్నారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చే సేవలు ఇవే :
- మ్యుటేషన్లపై ఆర్డీవో, కలెక్టర్లకు చేసుకునే అప్పీళ్లు, భూ సమస్యలు, నిర్ధిష్ట సమయంలో మ్యుటేషన్ పూర్తి చేయకుంటే దానంతట అదే పూర్తయ్యేలా సాంకేతికలో మార్పులు చేశారు.
- పార్ట్-బి కింద ఉన్న వారికీ యాజమాన్య హక్కులు కల్పించే విధంగా సాంకేతికతలో మార్పులు చేయగా, దరఖాస్తుల సమర్పణ, విచారణ నివేదికలు, అప్పీళ్లు తదితర ఆప్షన్లు ఉండనున్నాయి.
- పహాణీలో ఎప్పటికప్పుడు ఉన్నతీకరణ చేపట్టేలా, పట్టాదారు పేరే కాకుండా మరికొన్ని వివరాలను నిక్షిప్తం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- దరఖాస్తు చేసుకున్నా, చేసుకోకపోయినా ప్రభుత్వమే ఎసైన్డ్, లావుణీ పట్టాదారులకు పూర్తిస్థాయి హక్కులు జారీ చేసేందుకు కూడా ఆప్షన్ ఉండనున్నాయి. ధరణిలో ప్రస్తుతం ఉన్న 45 రకాల సమస్యలకు కొత్త చట్టం అమలుల్లోకి వచ్చాక తహసీల్దార్లు మండల స్థాయిలో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయవచ్చు. ఇలా నమోదు చేస్తే జిల్లా స్థాయిలో కలెక్టర్ పరిష్కరిస్తారు. ఆ పరిష్కారంపై సంతృప్తి లేకపోతే ల్యాండ్ ట్రైబ్యునల్ లేదా సీసీఎల్‌ఏకు అప్పీల్ చేసుకునేలా ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఏర్పాటు చేయనున్నారు.