తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ భారతి పోర్టల్‌లో కొత్త చిక్కులు! - TELANGANA BHU BHARATI PORTAL

కొత్త రెవెన్యూ చట్టం భూ భారతి పోర్టల్‌లో కొత్త చిక్కులు - మూల సర్వే నంబర్లలో ఉన్న భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణం

Telangana Bhu Bharati Portal Problems
Telangana Bhu Bharati Portal Problems (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 2:24 PM IST

Telangana Bhu Bharati Portal Problems : భూ భారతి పోర్టల్‌లో కొత్త చిక్కులు చుట్టుముట్టాయి. రాష్ట్రంలో 2017-18 మధ్య చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది జారీ చేసిన పట్టా పాసుపుస్తకాల్లో ఇష్టారీతిన విస్తీర్ణాను నమోదు చేశారు. అదే సమాచారాన్ని ధరణి పోర్టల్‌లో ఎక్కించి, దీన్ని భూ భారతిలోకి అప్‌లోడ్‌ చేశారు. ఈ క్రమంలో మూల సర్వే నంబర్లలో ఉన్న భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణాలు ఉండటం ఇబ్బందికరంగా మారింది. కొన్ని జిల్లాల్లో 50 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 30 వేలు, సంగారెడ్డిలో 15 వేలు, నల్గొండ జిల్లాలో 20 వేల ఎకరాల వరకు ఎక్కువ విస్తీర్ణాలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా కలుపుకుంటే అదనపు విస్తీర్ణం 5 లక్షల ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నట్లు అంచనా.

ఇవి సమస్యలు :

  • 1956లో రీసర్వే సెటిల్‌మెట్‌ రిజిస్టర్(ఆర్‌ఎస్‌ఆర్‌)ను రెవెన్యూ శాఖ రూపొందించగా, దీనినే సేత్వార్‌ అని పిలుస్తారు. అంతకు ముందు క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి సర్వే నంబరులో ఎంత విస్తీర్ణం ఉందో గుర్తించి సేత్వార్‌లో నమోదు చేశారు. అంటే ఒక సర్వే నంబరులో ఎంత విస్తీర్ణం ఉందో సేత్వార్‌(ఆర్‌ఎస్‌ఆర్‌) వెల్లడిస్తుంది. దీని ప్రకారమే పహాణీలు, 1బీ అమలు చేస్తూ వస్తున్నారు.
  • 2017 సెప్టెంబరు నుంచి రాష్ట్రంలో ఎల్‌ఆర్‌యూపీ చేపట్టగా, భూ దస్త్రాల నవీకరణ చేపట్టి రెవెన్యూ పోర్టల్‌(టీఎల్‌ఆర్‌ఎంఎస్‌)లో అప్‌లోడ్‌ చేసే క్రమంలో తప్పులు చోటుచేసుకున్నాయి. చాలా జిల్లాల్లో నవీకరణ జరగని సమాచారన్ని అప్‌లోడ్‌ చేశారు. మూల సర్వే నంబర్లలో ఉన్న భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణాలను పోర్టల్‌లోకి ఎక్కించారు.
  • ఈ సమాచారం ఆధారంగానే కొత్త పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. అదే సమాచారం 2020 నవంబరు 2 నుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్‌లో నమోదు చేశారు.
  • ఆర్వోఆర్‌-2020లో అదనపు విస్తీర్ణాల సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి నిబంధనలు లేవు. ఈ పెరిగిన విస్తీర్ణాలు 2019 నుంచి రెవెన్యూ దస్త్రాల్లో అమల్లోకి వచ్చింది.
  • ఆర్‌ఎస్‌ఆర్‌ సమస్య కారణంగా ఒక్కో జిల్లాలో వేల మందికి భూ విస్తీర్ణాల్లో కోతలు, కొందరికి విస్తీర్ణం పెంచి పాసుపుస్తకాలు జారీ చేయడంతో అదే సర్వే నంబర్లలోని మరికొందరికి తక్కువ విస్తీర్ణంతో పాసుపుస్తకాలు ఇచ్చేశారు.
  • ఆర్వోఆర్‌ -2025కు అనుగుణంగా కొత్త పోర్టల్‌ భూ భారతిని అమలు చేసేందుకు ధరణి పోర్టల్లోని భూముల వివరాలను అప్‌లోడ్‌ చేస్తుండగా, ఈ సందర్భంగా అదనపు విస్తీర్ణాలతో సమస్యలు వస్తున్నట్లు గుర్తిస్తున్నారు.
  • ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో ఉన్న భూమిని పరిశీలించి దస్త్రాల్లో అదనంగా పెంచిన విస్తీర్ణం తొలగించాల్సి ఉండగా దీనిపై రెవెన్యూశాఖ దృష్టి సారించింది.

రైతుబంధు సొమ్ము అక్రమంగా పొందేందుకే : రాష్ట్రంలో రైతుబంధు కింద ఏడాదికి రూ.10 వేల, కేంద్రం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.6 వేల అందించడంతో స్థానిక రెవెన్యూ సిబ్బంది సాయంతో కొందరు భూమి విస్తీర్ణాలను ఇష్టారీతిన పెంచేసి, రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. దీనికి తోడు బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందేందుకు పాసుపుస్తకాలు ఉపయోగపడతాయని ఆలోచించి, స్థానిక నాయకులు, రెవెన్యూ సిబ్బంది, దళారులు చేతులు కలిపి ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.

రెండు ఎకరాలు ఉన్నోళ్లు ఐదెకరాలు : ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో భూమి లేకున్నా కొత్త పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. కొన్ని సర్వే నంబర్లలో గతంలో ఉన్న దానికన్నా విస్తీర్ణం పెరిగి, రెండెకరాలున్న రైతులకు ఐదు ఎకరాలు ఉన్నట్లు రాశారు. కొందరికైతే ఏకంగా యాభై ఎకరాలు ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. ఇటీవల అక్రమంగా విస్తీర్ణాలు పెంచి హక్కులు కల్పించిన ఉదంతాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూల సర్వే నంబర్లోని భూమి కన్నా ఎక్కువగా నమోదై ఉండటం గందరగోళానికి దారి తీసింది.

త్వరలోనే 'భూ భారతి' అమలు - కొత్త టెక్నాలజీతో మరిన్ని ఆప్షన్లు

మీ వ్యవసాయ భూమి నాలా(Non-Agriculture Land)గా నమోదైందా? - అయితే ఇది మీ కోసమే!

ABOUT THE AUTHOR

...view details