New Ration Cards in Telangana : కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం కొలిక్కి రాగానే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ మొదలవుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు.
డిజిటల్ కార్డులు కొలిక్కి రాగానే : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అనే ఉత్కంఠ చాలా రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే తొలుత ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుందని పౌరసరఫరాల అధికారులంటున్నారు. ఒక కుటుంబానికి రేషన్ కార్డుంది. రేషన్ మాత్రం భార్యాభర్తలకే వస్తోంది. అలాగే వారి ఇద్దరు పిల్లలకు రావట్లేదు. మరో కుటుంబంలో మెట్టినింట రేషన్‌కార్డులో కోడలి పేరు చేరలేదు. అలాగని పుట్టినింట కార్డులోనూ లేదు. పెళ్లయి అత్తారింటికి వెళ్లాక ఆమె పేరును పుట్టింటి కార్డులోంచి తొలగించారు. సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనున్నట్లు పౌరసరఫరాలశాఖ వర్గాల సమాచారం.
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ - త్వరలో కొత్త రేషన్ కార్డులు
రేషన్‌కార్డుల్లో అర్హులైన కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిసింది. ‘‘ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం కొలిక్కి రాగానే ఈ విషయంపై కీలక నిర్ణయం ఉంటుంది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబసభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది’ అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.