Telangana Govt on New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? ఐతో మీకో శుభవార్త. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం కొలిక్కి రాగానే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ మొదలవుతుందని పౌరసరఫారల శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు.
ఒక కుటుంబానికి రేషన్‌కార్డు ఉంది. కానీ రేషన్ మాత్రం భార్యాభర్తలకే వస్తోంది. వారి ఇద్దరు పిల్లలకు మాత్రం రావడంలేదు. మరో కుటుంబంలోని రేషన్‌కార్డులో కోడలి పేరు చేరలేదు. అలాగని పుట్టినింట కార్డులోనూ ఆమె పేరు లేదు. పెళ్లయి అత్తారింటికి వెళ్లాక ఆమె పేరును పుట్టింటి కార్డులో నుంచి తొలగించారు. ఏళ్లుగా ఉన్న ఇలాంటి సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనున్నట్లు పౌరసరఫరాలశాఖ వర్గాల సమాచారం. అర్హులైన కొత్త కుటుంబ సభ్యుల పేర్లను రేషన్‌కార్డుల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిసింది.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం కొలిక్కి రాగానే ఈ విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను ఉన్న రేషన్‌కార్డుల్లో చేర్చే ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఆ తర్వాత కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణ సైతం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌కార్డులోని అర్హుల పేర్లను చేర్చాలని మీసేవా కేంద్రాల ద్వారా దాదాపు లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో ఇన్నాళ్ల వరకు పౌరసరఫరాల శాఖ వాటిని పరిశీలించలేదు.