New ID Cards For Secretariat Employees in Telangana :తెలంగాణ సచివాలయంలో నకిలీ ఐడీ కార్డులతో ప్రైవేటు వ్యక్తులు ప్రవేశిస్తున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 6న తహసీల్దారు పేరిట గలనకిలీ ఐడీ కార్డుతో సంచరిస్తూ అంజయ్య అనే వ్యక్తి పట్టుబడ్డాడు. వీడియో కాల్స్ ద్వారా తాను సచివాలయంలో ఉన్నట్లు బాధితులను నమ్మించి పైరవీలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక గత నెల 28న భాస్కర్‌రావు అనే వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న సమయంలో అక్కడే అనుమానంగా సంచరించారు. దీంతో ఆయనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆయన్ను పట్టుకున్నారు.
సెల్ఫీ కోసం : సీఎంతో సెల్ఫీ కోసం నకిలీ ఐడీ కార్డుతో లోపలికి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కొలువుదీరే ప్రాంగణంలో పది రోజుల వ్యవధిలో ఇద్దరు నకిలీలు దొరకడం వారి భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. దీంతో అటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్‌పీఎఫ్), ఇటు హైదరాబాద్ పోలీసులు తనిఖీలపై దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశాలను నిర్వహించాలని సిఫార్సు చేస్తున్నారు.
పరిజ్ఞానంతో కూడిన కొత్త ఐడీ కార్డులు :సచివాలయంలో 1,770 మంది వరకు ఉద్యోగులు రోజువారీ విధులకు హాజరవుతున్నారు. వారంతా దాదాపుగా ఒకే సమయానికి విధులకు వస్తుండటంతో ప్రతిఒక్కరిని తనిఖీ చేయడం ఎస్‌పీఎఫ్ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. వరుసలో ఎక్కువసేపు నిల్చోవడంతో అధికారుల విధులకూ ఆలస్యమవుతుండటంతో ఐడీ కార్డులు చూపిన వారిని తొందరగా లోపలికి పంపిస్తున్నట్లు తేలింది. అయితే ఆ ఐడీ కార్డు అసలుదేనా లేదా అని తనిఖీ చేసే విధానం మాత్రం లేదు. ఈ నేపథ్యంలోనే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త ఐడీ కార్డులను ఉద్యోగులకు ఇచ్చేలా సిఫార్సు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నారు. వాస్తవానికి సచివాలయంలో ఉద్యోగులతోపాటు సందర్శకుల కోసం వీడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్‌ఎఫ్‌ఐడీ) కార్డులు ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి 2023 జూన్ 16నే ఆదేశాలు జారీ చేశారు.