New Guidelines For SADAREM Certificate Slot Booking Date : శారీరక వైకల్యం, మానసిక లోపాలు, కంటి చూపునకు సంబంధించి దృష్టి వైకల్యం ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించేదే సదరం సర్టిఫికెట్. దీనిని ప్రైవేటు వ్యక్తులు, వైద్యులు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం అందిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి ఆర్థో, అంధత్వం, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తుంది. తాజాగా ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ పొందడానికి సులువైన విధానం తీసుకువచ్చింది.
మీ-సేవా వసూళ్లకు చెక్ :దివ్యాంగుల వైకల్యం నిర్ధారించేందుకు మొదట సదరం స్లాటు నమోదు చేసుకొని ఆ తర్వాత శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉంటే స్లాటు తక్కువగా విడుదల చేసే వారు. చాలా మంది రోజుల తరబడి మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఏదో ఒక రూపంలో సదరం ధ్రువపత్రం ఇస్తే చాలని భావించే వారు. దివ్యాంగుల అలసత్వం ఆసరాగా చేసుకొని మీ-సేవ నిర్వాహకులు స్లాటు నమోదుకు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వసూలు చేసే వారు.
‘ఆసరా’ దూరం... గడువు తీరి నిలిచిన వికలాంగుల పింఛన్లు
ఎక్కడైనా స్కాటు నమోదు చేసుకోవచ్చు : రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి మీ-సేవ కేంద్రాల్లో ఎప్పుడైనా స్లాటు నమోదు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ కొత్త విధానంతో చాలా మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. మామూలుగా అయితే, ప్రతి నెల నిర్ణయించిన తేదీల్లో సదరం శిబిరాలు ఖరారు ఏర్పాటు చేస్తారు. ధ్రువీకరణ పత్రం కావాల్సిన వారు స్లాటు నమోదు చేసుకుంటారు. ప్రభుత్వం ఇకపై దివ్యాంగులు ఎప్పుడైనా స్లాటు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
కేటాయింపు ఎలా అంటే? :
- స్లాటు పొందేందుకు మీ-సేవ కేంద్రంలో ఆధార్, పీపీ ఫొటో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- శిబిరం నిర్వహించే తేదీ, సమయం, సమాచారం చరవాణికి వస్తుంది.
- ఆయా తేదీల్లో శిబిరానికి వెళ్లాలి.
- ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించే శిబిరానికి వెళ్తే వైద్యులు పరీక్షించి వైకల్యం నిర్ధారించి ధ్రువపత్రం అందజేస్తారు.
- సర్టిఫికెట్ ఉన్న వారు పునరుద్ధరించుకునేందుకు(రెన్యువల్) కూడా స్లాటు అవసరం.
గతంలో ఎలా ఉండేదంటే..? : సదరం శిబిరానికి సంబంధించిన తేదీలను గ్రామీణాభివృద్ధి అధికారులు ప్రతి నెలా ఖరారు చేస్తారు. నెల ప్రారంభం కాగానే మూడు, నాలుగు రోజుల్లో శిబిరాలు నిర్వహిస్తారు. అధికారులు తేదీలు ఖరారు కాగానే ఒక రోజు ముందు దివ్యాంగులకు స్లాట్ నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చేవారు. పరిమిత సంఖ్యలో వీటిని విడుదల చేయడంతో దివ్యాంగులు తెల్లవారుజాము నుంచే మీ-సేవ కేంద్రాల వద్ద బారులు తీరే వారు. ఒక్కోసారి సాంకేతిక సమస్యలు తలెత్తేవి. నెలలో ఎంత సంఖ్యలో స్లాట్లు ఇచ్చారో అంతకు మించి నమోదు చేసే వారు. సమయం తక్కువ ఉండడంతో అందరికీ దొరికేది కాదు. మిగతావారు ఎదురుచూసేవారు. వారి కష్టాలు దూరం చేసేందుకు ఈ సులువైన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
దివ్యాంగ పింఛన్ కావాలా? - అయితే ఈ సర్టిఫికెట్ తప్పనిసరి? - HOW TO GET SADAREM CERTIFICATE