Distribution Of Pension In AP 2024 : ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో పలు సవరణలు చేసింది. నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే పింఛన్ సొమ్మును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందిస్తామని తెలిపింది. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. పింఛను పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100 శాతం పంపిణీ పూర్తికి చర్యలు తీసుకోవాలని సూచించింది. 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో ముందురోజే పింఛన్లు పంపిణీ చేయాలని, మిగతా పింఛన్లు రెండో తేదీన అందించాలని సూచించింది. రెండో తేదీన సెలవు దినంగా ఉంటే పింఛన్‌ను ఆ మరుసటి రోజు (3వ తేదీ) అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది.
NTR Bharosa Pension Distribution in AP: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వచ్చే నెల ప్రారంభించిన రోజే 100 శాతం పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం ఆదేశించారు. ఈ నెల 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లను ఆ రోజు ఆదివారం కావడంతో ఒక రోజు ముందే పంపిణీ చేసింది. తొలి రోజే 96 శాతం పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. దీంతో ప్రతి నెలా ఒక్క రోజులోనే 100శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేపట్టింది.