ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదేళ్లలో 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా 'సమీకృత ఇంధన పాలసీ' - New Energy Policy in State - NEW ENERGY POLICY IN STATE

New Energy Policy in State : రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో రూ. 10లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ‘సమీకృత ఇంధన పాలసీ’ని ప్రభుత్వం రూపొందించింది. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయో ఫ్యూయల్, పీఎస్‌పీ, హైబ్రిడ్‌ ప్రాజెక్టులు సోలార్‌ పార్కులు, తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఒకే పాలసీని తీసుకొస్తోంది. ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించనుంది. ప్రధానంగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా ప్రభుత్వం పాలసీని రూపొందించింది. పునరుత్పాదక తయారీ జోన్‌లను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం 500 విద్యుత్‌ ఛార్జింగ్‌ కేంద్రాలను సైతం నెలకొల్పనుంది.

new_energy_policy_in_state
new_energy_policy_in_state (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 12:30 PM IST

New Energy Policy in State :రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇంధన పాలసీని సిద్ధం చేసింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా, ఎలక్ట్రోలైజర్‌ మాన్యుఫాక్చరింగ్, బయో ఫ్యూయల్, బ్యాటరీ స్టోరేజి, పీఎస్పీ ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రస్తుతం ఇస్తున్న రాయితీలను కొనసాగిస్తూనే కొత్తగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్ర డిమాండ్‌లో పునరుత్పాదక విద్యుత్‌ వాటాను గణనీయంగా పెంచడం ద్వారా విద్యుత్‌ సేకరణ ఖర్చును తగ్గించే లక్ష్యంతో నూతన పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. క్లీన్‌ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటే లక్ష్యంగా నిర్దేశించుకుంది.

సర్క్యులర్‌ ఎకానమీని సులభతరం చేసేందుకు పెట్టుబడి అవకాశాలను సృష్టించడం తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడమే పాలసీ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది. నూతన పాలసీ ఐదేళ్లు అమలులో ఉంటుంది. గతంలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుని గ్రౌండింగ్‌, ఉత్పత్తిలోకి రానివాటికి కూడా నూతన పాలసీ వర్తింపచేసే వెసులుబాటు కల్పించింది.
Banking Facility for Companies Setting up Power Plants in the State :రాష్ట్రంలో విద్యుత్‌ప్లాంట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు బ్యాంకింగ్‌ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ విద్యుత్‌ను తిరిగి వినియోగించుకునేందుకు నిబంధనలను చేర్చింది. ఆఫ్‌-పీక్‌ విద్యుత్‌ను ఆఫ్‌పీక్‌ వ్యవధిలోనే ఎప్పుడైనా తిరిగి వినియోగించుకునేలా, పీక్‌ డిమాండ్‌ విద్యుత్‌ను ఎప్పుడు అవసరమైనా వినియోగించుకునేలా మార్చింది. సాధారణ బ్యాంకింగ్‌ విద్యుత్‌ను నార్మల్, ఆఫ్‌పీక్‌ వ్యవధిలో వినియోగించుకునే వెసులుబాటు సంస్థలకు ఉంటుంది. పీక్‌ గ్రిడ్‌ డిమాండ్‌లో 5శాతం వరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ బ్యాంకింగ్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఆ తర్వాత ఏటా 5శాతం చొప్పున పెంచుతుంది. రాష్ట్రంలో కొత్తగా పునరుత్పాదక తయారీ జోన్‌- ఆర్‌ఈఎంజడ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో భారీగా పెట్టుబడులు- ఎక్స్ వేదికగా లులు గ్రూప్

ప్రైవేటు రంగంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి ఆర్‌ఈఎంజడ్‌లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. జియో థర్మల్, టైడల్, ఓషియన్‌ ఎనర్జీస్, బయో ఫ్యూయల్, బయోగ్యాస్, ఇథనాల్‌ మిశ్రమం, స్టోరేజి, కార్బన్‌ క్యాప్చర్‌ వంటి ఇన్నోవేటివ్‌ ఆర్‌ఈ టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌, క్యాపిటల్‌ సబ్సిడీ కింద 20శాతం మొత్తాన్ని పైలట్‌ ప్రాజెక్టులకు అందిస్తుంది.

ప్రాజెక్టులకు లీజు విధానంలో భూములు ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలు సైతం అందించనుంది.సౌరవిద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు సేకరించిన భూములకు ఎకరాకు ఏడాదికి రూ. 31వేలు, రెండేళ్లకు 5శాతం చొప్పున పెంచి ఇవ్వనుంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టులకు 5 కిలోవాట్ల వరకు ఫీజు లేదు. 100 కిలోవాట్లకు వెయ్యి, వెయ్యి కిలోవాట్లకు 10వేలు, అంతకుమించి ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు మెగావాట్‌కు 25వేలు నెడ్‌క్యాప్‌ వసూలు చేస్తుంది.

సోలార్‌ మాడ్యూల్స్, విడిభాగాల తయారీ సంస్థలకు ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ - ఎఫ్‌సీఐపై పెట్టుబడి రాయితీ కింద ఐదేళ్లలో 30శాతం చెల్లించనుంది. ఓపెన్‌ యాక్సెస్‌ ఛార్జీలు, క్రాస్‌సబ్సిడీ సర్‌ఛార్జీలను పదేళ్లు మినహాయించనుంది. స్టాంప్‌డ్యూటీ, ఎస్‌జీఎస్‌టీకి 5 ఏళ్ల మినహాయింపు, యూనిట్‌ విద్యుత్‌కు రూపాయి చొప్పున పదేళ్లు రాయితీ, నీటి సెస్సులో పదేళ్లు 25శాతం రాయితీ ఇవ్వనుంది.

రాష్ట్రానికి రానున్న రూ.లక్ష కోట్ల పెట్టుబడులు - ఏపీ జెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ భాగస్వామ్యంతో విద్యుత్‌ ప్రాజెక్టులు - APGENCO and NHPC in AP

పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ఎఫ్‌సీఐపై 30శాతం పెట్టుబడి రాయితీ ఐదేళ్లలో చెల్లించడం ఓపెన్‌ యాక్సెస్‌ ఛార్జీలు, క్రాస్‌ సబ్సిడీ సర్‌ఛార్జీలపై పదేళ్లు మినహాయింపు ఇస్తుంది. ల్యాండ్‌ కన్వర్షన్‌పై స్టాంపుడ్యూటీ మినహాయింపుతో పాటు ఎస్‌జీఎస్టీ ఐదేళ్లు మినహాయింపు కల్పించనుంది. విండ్‌ టర్బైన్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాజెక్టులకు, విండ్‌-సోలార్‌ హైబ్రిడ్‌ ప్రాజెక్టులు, మినీ హైడల్‌ ప్రాజెక్టులకూ ఇదే తరహా ప్రోత్సాహకాలను పాలసీలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

గ్రీన్‌ హైడ్రోజన్, డెరివేటివ్స్‌ ప్రాజెక్టులకు ప్లాంటు, పరికరాలపై 30శాతం పెట్టుబడి రాయితీ ఐదేళ్లలో చెల్లిస్తుంది. మొదటగా ఏర్పాటుచేసే 10 ప్లాంట్లు లేదా 1.5 ఏడాదికి మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం వరకే సబ్సిడీ అందిస్తుంది. ఇతర ప్రోత్సాహకాలను యథావిధిగా అందించనుంది. గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టులకు 30శాతం పెట్టుబడి రాయితీ, నిర్లవణీకరణ ప్రాజెక్టులకు ఎఫ్‌సీఐపై పెట్టుబడి రాయితీ 20శాతం, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లలో మౌలిక సదుపాయాలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు ప్రాజెక్టు వ్యయంపై 25శాతం ఐదేళ్లలో రాష్ట్రప్రభుత్వం అందిస్తుంది.

పీఎస్పీలకు లీజు విధానంలో కేటాయించే భూములను ఎకరాకు 31వేల చొప్పున 46 ఏళ్లకు భూములను ప్రభుత్వం కేటాయిస్తుంది. లీజు మొత్తాన్ని ప్రతి రెండేళ్లకు 5శాతం పెంచుతుంది. ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 30 శాతాన్ని రాష్ట్ర అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం కల్పించింది. టారిఫ్‌ను ఏపీఈఆర్‌సీ నిర్ణయిస్తుంది.

రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఐదేళ్లలో 500 ఛార్జింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి ఏర్పాటుకు చేసే మొత్తంపై 25శాతం పెట్టుబడి రాయితీ ఇవ్వనుంది. కార్పొరేషన్లు, జిల్లాకేంద్రాల్లో 150, జాతీయరహదారుల వెంబడి 150, మిగిలిన వాటిని ప్రైవేటు భవనాల్లో ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఏపీఈఆర్‌సీ నిర్ణయించిన మ్యాగ్జిమమ్‌ సీలింగ్‌ టారిఫ్‌- ఎంసీటీ వర్తింపజేయనుంది.దీంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో క్లీన్‌ ఎనర్జీ నాలెడ్జ్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌- సీఈకేఎస్‌డీసీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో గ్రీన్‌ ఎనర్జీకి ఉన్న అవకాశాల దృష్ట్యా అవసరమైన నాలెడ్జ్, ఎప్పటికప్పుడు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, ఈ రంగంలో నిపుణులను తీర్చిదిద్దడంతో పాటు సర్టిఫికేషన్‌ కోర్సులను ప్రభుత్వం అందిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details