New Courses Skills For Best Job Opportunities :చాలా మంది విద్యార్థులు కేవలం అకడమిక్ పుస్తకాలు బాగా చదివి పరీక్షల్లో 80శాతానికి పైగా మార్కులు సాధిస్తే ఉద్యోగాలు వస్తాయనే భ్రమలో ఉన్నారు. అదనపు స్కిల్స్ నేర్చుకోవాలనే సలహా ఇచ్చే వారు లేక వెనకబడిపోతున్నారు.
బీటెక్ రెండో ఏడాది నుంచే సన్నద్ధత :స్కిల్స్ నేర్చుకోవాలంటున్నారు కదా అని బీటెక్ చివరి ఏడాదిలో వాటిపై దృష్టి పెట్టాలనుకోవడం కూడా తప్పే అంటున్నారు నిపుణులు. బీటెక్ రెండో సంవత్సరం నుంచే ఇతర కోర్సులు, విదేశీ భాషలు నేర్చుకోవడం ప్రారంభించాలని చెబుతున్నారు. అప్పుడే చివరి ఏడాదిలో జరగబోయే క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు సన్నద్ధంగా ఉండొచ్చని సలహా ఇస్తున్నారు. సీ, సీప్లస్‌ప్లస్, జావా, పైథాన్ వంటి కోర్సులకు కాలం చెల్లిందని, వీటికి ఉద్యోగాలు రావని, ప్రస్తుత సాంకేతికతను అందిపుచ్చుకునే కొత్త కోర్సులు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని కొత్తగా వచ్చింది. ఇందులో సర్వీస్ నౌ, పెగా, ఏడబ్ల్యూఎస్, క్లౌడ్ వంటి సర్టిఫికెట్ కోర్సులు నేర్చుకోవాలి. అప్పుడే కంపెనీల క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు సాధించగలుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు.
బీటెక్ చదువుతున్న సమయంలోనే సర్వీస్ నౌ కోర్సుపై శిక్షణ తీసుకోవాలి. స్మార్ట్ బ్రిడ్జి కంపెనీ వారు ఈ కోర్సుపై ప్రతిరోజూ సాయంత్రం ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తారు. పూర్తయ్యాక పరీక్ష ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. ఈ రెండింటిలో విద్యార్థి నైపుణ్యం సాధిస్తే అప్పుడు సర్వీస్ నౌ కంపెనీ ఒక ధ్రువపత్రం జారీ చేస్తుంది. అది దగ్గరుంటే ప్రాంగణ నియామకాల్లో పెద్ద కంపెనీలు సైతం వెంటనే తీసుకోవడమే కాకుండా ప్యాకేజీలు కూడా బాగానే ఇస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలను అన్ని రంగాల్లో విపరీతంగా వినియోగిస్తున్నారు. వీటికి టూల్స్ వాడతారు. టూల్స్ తెలియాలంటే ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవాలి. అలాగే ఆయా రంగాల్లో మార్పులు గమనిస్తుండాలి. ఆంగ్ల భాషతో పాటు ఒక విదేశీ భాష నేర్చుకోవాలి.