NDSA Committee Visits Annaram Barrage : జాతీయ డ్యామ్ సేఫ్టీ అధారిటీ నిపుణుల కమిటీ(NDSA Committee) చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన రెండోరోజు కొనసాగింది. నిపుణుల బృందం ఇవాళ అన్నారం బ్యారేజీని సందర్శించింది. తొలుత కమిటీ నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి బ్యారేజీ పైభాగంలో పరిశీలించారు. బ్యారేజీకి వచ్చే నీటి ప్రవాహం, నీటి నిల్వ సామర్థ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Annaram Barrage Damage Issue :సీపేజీలు ఏర్పడిన 28, 38, 35, 48 పియర్ల వద్ద క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా పియర్ల వద్ద వెంట్లు, గేట్లను పరిశీలించారు. పియర్లకు పగుళ్లు ఏమైనా ఏర్పడ్డాయా అని ఆరా తీశారు. బుంగలు ఎప్పుడు ఏర్పడ్డాయి? వాటిని అరికట్టేందుకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకున్నారు? ఎలా మరమ్మతులు చేశారు? అనే వివరాలను ఇంజినీర్లను అడిగారు. 2020లో మొదటిసారిగా క్యావిటీలను గుర్తించామని, వాటికి నివారణ చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు.
2022లో అన్నారంకు(Annaram Barrage)దాదాపు 18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా తట్టుకుందని, తర్వాత 2023లో 11 లక్షల ప్రవాహం వచ్చినా ఇబ్బందులు తలెత్తలేదని వివరించారు. రసాయనాలతో గ్రౌటింగ్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సీపేజీ ఎలా ఏర్పడుతోంది. కిందిభాగం ఏవిధంగా ఉందో తెలుసుకోవడానికి, ఎంతమేర విస్తరించి ఉన్నాయి, తదితర వివరాలను తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఈఆర్టీ(ఎలక్ట్రో రెసిస్టెన్సీ టెస్ట్), జీపీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారికి తెలిపారు. బుంగలు ఏర్పడ్డ ప్రాంతాలను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే బ్యారేజీకి సంబంధించిన డ్రాయింగ్స్, సీకెంట్ ఫైల్స్, అండర్ కవర్ డ్రాయింగ్స్, డిజైన్లకు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్నారు.