తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి - మేడిగడ్డపై నిపుణుల కమిటీ నివేదిక - NDSA Report on Medigadda Barrage - NDSA REPORT ON MEDIGADDA BARRAGE

NDSA Report on Medigadda Barrage : మేడిగడ్డ ఆనకట్టలో దెబ్బతిన్న ఏడో బ్లాకులోని అన్ని గేట్లను పూర్తిగా తెరిచేందుకు సాధ్యం కాకపోతే కటింగ్​ ద్వారా తొలగించాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. నీటి ఒత్తిడి పడకుండా మూడు ఆనకట్టల్లోని అన్ని గేట్లను పూర్తిగా ఎత్తివేయాలని సూచించింది. దెబ్బతిన్న పియర్స్​కు పగుళ్లు ఎక్కువగా రాకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపింది. మేడిగడ్డతో పాటు మిగిలిన రెండు బ్యారేజీలకి నిర్ణీత విధానంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల సాయంతో మరిన్ని పరీక్షలు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్​ కమిటీ మధ్యంతర నివేదికలో పేర్కొంది.

NDSA Report on Medigadda Barrage
NDSA Report on Medigadda Barrage (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 7:26 AM IST

ఏడోబ్లాక్‌లోని 8 గేట్ల పరిస్థితి అత్యంత దారుణం - మేడిగడ్డపై నిపుణుల కమిటీ నివేదిక (ETV Bharat)

NDSA Committee Report on Medigadda Barrage : మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకి వర్షాకాలంలోగా తీసుకోవాల్సిన చర్యలను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పటివరకు చేసిన పరిశీలన, అధ్యయనాలు, ఇంజనీర్లతో మాట్లాడిన అంశాల ఆధారంగా తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మత్తులపై రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఎన్డీఎస్​ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. మేడిగడ్డని 2019 జూన్ లో ప్రారంభించి నీరు నిల్వచేసిన తర్వాత వర్షాకాలం ముగిశాక ఆనకట్ట దిగువన సీసీబ్లాక్స్, ఆప్రాన్ దెబ్బతిన్నట్లు పేర్కొంది. నీటిని దిగువకు వదిలి మరమ్మత్తులు చేయాల్సి ఉన్నా అలా చేయకుండా జలాశయాన్ని వినియోగించినట్లు తెలిపింది.

మేడిగడ్డ బ్యారేజ్​ ఏడో బ్లాక్​లో 11 నుంచి 22 నంబర్ల వరకు పియర్స్​ ఉంటే 16 నుంచి 21వ పియర్స్​లో కదలిక ఉందని కమిటీ చెప్పింది. అలాగే ర్యాప్ట్​ సహా పియర్స్​ ఎగువ భాగంతో పాటు దిగువన కదలిక ఉందని కమిటీ స్పష్టం చేసింది. 20వ నంబర్​ పియర్​ 1.2 మీటర్ల కంటే ఎక్కువగా కుంగిందని అందులో భారీగా పగుళ్లు ఏర్పడినట్లు పేర్కొంది. గైడ్​రెయిల్​ సహా రేడియల్​ గేట్లు దెబ్బతిన్నాయని, ఇతర పియర్స్​లోనూ పగుళ్లు ఏర్పడినట్లు వివరించింది. వాటితో పాటు ఇతర భాగాలైన గ్యాంట్రీ గిర్డర్​, గ్యాంట్రీరెయిల్​ అలైన్​మెంట్​ సహా ఆనకట్ట దిగువన ఉన్న సీబీ బ్లాక్స్​, లాంచింగ్​ ఆప్రాన్​ దెబ్బతిన్నట్లు పేర్కొంది.

Medigadda Barrage Damage Issue :అందులో కొన్ని కొట్టుకుపోగా మరికొన్ని కదిలాయని ప్లింత్‌స్లాబ్, వియరింగ్‌ కోట్ దెబ్బతిన్నట్లు నివేదికలో కమిటీ పేర్కొంది. ఏడోబ్లాక్‌లోని 8 గేట్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆ బ్లాక్‌లోని పియర్స్, రాఫ్ట్ బాగా కుంగడంతో ఆ పరిస్థితి వచ్చిందని వివరించింది. 20వ పియర్‌ సహా రాఫ్ట్‌లో కదలికతో సీకెంట్ పైల్‌కటాఫ్, కాంక్రీట్ ప్లింత్ స్లాబ్ మధ్య ఉన్న ఖాళీని స్పష్టంచేసిందని కమిటీ తెలిపింది. పియర్స్​ దిగువన ప్లింత్​స్లాబ్​, సీకెండ్​ పైల్​ దెబ్బతిన్నట్లు తెలిపింది. పియర్స్​ ముందు ఇసుక పైపింగ్​ రంధ్రాలున్నట్లు సీకెంట్​ పైల్​, పైల్​ రాఫ్ట్​ జాయింట్​ సిస్టం, రాఫ్ట్​ దిగువన, తదితరాలకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

మరమ్మత్తులు తాత్కాలికం మాత్రమే : ప్రస్తుత పరిస్థితుల్లో 7వబ్లాక్‌కి ఏ మరమ్మత్తులు చేపట్టినా తాత్కాలికం మాత్రమేనని అవి చేసినా అనూహ్య కదలికలు, మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని కమిటీ పేర్కొంది. పియర్స్, రాప్ట్‌ఫ్లోర్‌కి వచ్చిన పగుళ్లను ఎప్పటికప్పుడు గమనించాలని మరింత పెరగకుండా 16 నుంచి 22వ పియర్స్‌కి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కమిటీ సూచించింది. ఆ సమయంలో రాప్ట్‌పై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్త తీసుకోవాలని, దెబ్బతిన్న ప్రెజర్ రిలీజ్ వాల్వ్‌ను సరిచేయాలని తెలిపింది. దెబ్బతిన్న, కదలిన ప్లింత్ స్లాబ్‌లు తొలగించి రివర్ బెడ్‌సరిగా ఉండేలా చూడాలంది. 7బ్లాక్‌లో దెబ్బతిన్న రాఫ్ట్, ప్లింత్ స్లాబ్ ఎదుట ఇసుక సంచులు ఏర్పాటుచేసి, కాంక్రీట్ వేయాలని పేర్కొంది. ప్లింత్ స్లాబ్ దిగువన 9 మీటర్ల లోతు వరకు షీట్‌పైల్ ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. జీపీఆర్​ నివేదిక ప్రకారం బాయిలింగ్​ పాయింట్స్​ను కెమెరా ద్వారా రికార్డింగ్​ చేసి ఆ తర్వాత అన్నింటికి గ్రౌటింగ్​ చేయాలని తెలిపింది.

ఏడో బ్లాక్​లోని గేట్లు అన్నీ తెరవాలి : బ్యారేజీ, గేట్లపై నీటిఒత్తిడి పడకుండా వర్షాకాలం కంటె ముందే ఏడో బ్లాక్​లోని అన్ని గేట్లను పూర్తిగా తెరవాలని, అంతకుముందే గేట్లు అన్నింటినీ పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకోవాలని కమిటీ సూచించింది. ఆ ప్రక్రియలో గ్యాంట్రీ క్రేన్‌ను ఏడో బ్లాక్ మినహా ఇతర బ్లాకుల్లో మాత్రమే ఉంచాలని పేర్కొంది. పగుళ్లు వచ్చిన పియర్స్‌కు గేట్లను తెరవడం కంటే ముందే రక్షణ చర్యలుచేపట్టాలని, 20వ పియర్‌కు ఇరువైపులా ఉన్న 20, 21 గేట్లకు గరిష్ఠ నష్టం జరిగినందున వాటిని కటింగ్ చేసి పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది.

మిగిలిన ఆరు గేట్లను పూర్తిగా ఎత్తాలన్న కమిటీ ఒకవేళ సాధ్యం కాకపోతే వాటిని పూర్తిగా తొలగించాలని తెలిపింది. ఏడో బ్లాక్‌ ఎగువన, దిగువన ఉన్న సీసీబ్లాకుల్లో దెబ్బతిన్న వాటిని తొలగించి రివర్ సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలంది. ఎక్కడైనా బాయిలింగ్ గుర్తిస్తే ఇసుక ద్వారా అరికట్టి ఇన్‌వర్టెడ్ ఫిల్టర్, సీసీ బ్లాకులు వేయాలని సూచించింది. మేడిగడ్డ ఆనకట్టలోని ఇతర బ్లాకులకు అవసరమైన మరమ్మత్తులు చేపట్టడం సహా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ఆ బ్లాకుల్లోని గేట్లను వర్షాకాలానికి ముందే పూర్తిగా ఎత్తాలని, నీటి ప్రవాహానికి ఏ ఇబ్బంది లేకుండా ఎగువన, దిగువన ఏవైనా అడ్డంకులు ఉంటే వెంటనే తొలగించాలని కమిటీ సూచించింది.

అన్నారంలో ఆది నుంచి సమస్యే :అన్నారం ఆనకట్టలో 2019, 2020 వర్షాకాలం తర్వాత బ్యారేజ్ దిగువన సీసీబ్లాకులు కదిలాయని అందుకే రాప్ట్‌లో వియరింగ్ కోట్ కొట్టుకుపోయిందని కమిటీ తెలిపింది. 2020 ఏప్రిల్​లో సీపేజీ వస్తే గ్రౌటింగ్ ద్వారా అరికట్టారని 2021 జులైలో సీపేజీ సమస్య తలెత్తగా 2024 జనవరిలో గ్రౌటింగ్ చేశారని పేర్కొంది. అక్కడ కూడా సీసీబ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్ దెబ్బతిన్నట్లు తెలిపింది. సుందిళ్ల ఆనకట్టకి 2019 లో సీసీ బ్లాకులు కదిలిపోయాయన్న కమిటీ అక్కడా రాఫ్ట్‌లో వియరింగ్ కోట్‌ కొట్టుకుపోయినట్లు పేర్కొంది. 2020 మేలో సీపేజీ సమస్య తలెత్తితే గ్రౌటింగ్ చేశారని, 2022 లోనూ సీసీబ్లాకులు, రాప్ట్‌లో సమస్య వచ్చిందని తెలిపింది.

2023 అక్టోబర్‌లో సీపేజీ వస్తే మళ్లీ గ్రౌటింగ్‌తో సరిచేసినట్లు పేర్కొంది. ఆ రెండు బ్యారేజీలకు సంబంధించి అన్ని గేట్లను పూర్తిగా ఎత్తాలని కమిటీ సూచించింది. అన్నింటనీ సరిచూసుకొని అవసరమైన మరమ్మత్తులు చేయాలని, ఇసుక మేటలు సహా అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించాలని పేర్కొంది. మూడు ఆనకట్టలకు ప్రత్యేకించి మేడిగడ్డకు తదుపరి మరిన్ని విస్తృతమైన పరిశీలనలు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. సాధారణ, జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలతో పాటు కాంక్రీట్ నిర్మాణాలపై పరిశీలన చేయాలని నిర్ధేశిత ప్రమాణాలకు లోబడి, ఐఎస్ కోడ్‌లకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేసింది. దిల్లీలోని సీఎస్ఎంఆర్ఎస్, పూణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్, హైదరాబాద్​లోని ఎన్​జీఆర్ఐ తదితర సంస్థల సాయంతో పరీక్షలు చేయాలని కమిటీ సూచించింది.

మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం - అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా ఆనకట్ట పనులు - NDSA Committee On Kaleshwaram

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్దఎత్తున లోపాలు - విజిలెన్స్‌ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు

ABOUT THE AUTHOR

...view details