NDA Govt Focus On Etikoppaka Dolls in AP : రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన ఏటికొప్పాక హస్తకళ మరింత వెలుగులీనేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బొమ్మల తయారీలో అత్యంత కీలకమైన అంకుడు కర్ర, తెల్లపొణి చెట్లు తగ్గిపోవడంతో కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ముడి సరకు కొరత రాకుండా ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూముల్లో అంకుడు కర్ర, తెల్లపొణిక చెట్లు పెంచాలని అధికారులకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రెండు, మూడు తరాలకు సరిపడా చెట్లు పెంచాలనే ప్రణాళిక తయారు చేసి తక్షణం అమలు చేయాలని అధికారులకు సూచించింది. ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో 5 వేల ఎకరాల్లో అంకుడు కర్ర మొక్కలు పెంచాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.
ఈ చెట్టు బంగారం - ఒక్కటి ఉన్నా చాలు కాసుల పంటే
అంకుడు మొక్క ఇదే :తిలక్కబొమ్మల తయారీలో ఏటికొప్పాక జాతీయ స్థాయిలో జీఐ ట్యాగ్ గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో 250 కుటుంబాలకు చెందిన 500 మంది కళాకారులు ఈ బొమ్మలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరిలో మహిళలు 160 మందికి పైగా ఉన్నారు. రెండు శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఏటికొప్పాక కళాకారులకు ఉంది. లక్క బొమ్మల తయారీకి సున్నితమైన అంకుడు కర్రను వినియోగిస్తారు. గతంలో అంకుడు కర్ర కళాకారులకు పుష్కలంగా దొరికేది.
విపరీతంగా చెట్ల నరికివేత కారణంగా ఇప్పుడు ఈ కర్ర కొరత ఏర్పడింది. కూలీలు అడవుల్లోకి వెళ్లి చాలా దూరం నుంచి ఈ కర్రను మోసుకురావాల్సి వస్తోంది. దీంతో కళాకారులకు అదనపు ఖర్చు పెరిగిపోయింది. గతంలో మోపు (10 కర్రల కట్ట) రూ. 1000కి లభించేది. ఇప్పుడు మోపు ధర రూ.2500 లకు పెరిగింది. అంత ధర వెచ్చించినా బొమ్మల తయారీకి సరిపడా లావు కర్ర దొరకడం లేదు. కలప వ్యయం పెరిగిన కారణంగా బొమ్మ తయారీ ఖర్చు 3 రెట్లు పెరిగింది. దీంతో బొమ్మల అమ్మకాలు తగ్గిపోవడంతో కళాకారులు లాభాలు తగ్గించుకోవాల్సి వస్తోంది.