NDA Vs YSRCP in Legislative Council: శాసనమండలిలో ఎన్డీఏ, వైఎస్సార్సీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ నడుస్తోంది. ఎన్నికల హామీలు, ఉద్యోగాలపై, వీసీల నియామకాలపై పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. తొలుత మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చను ఎమ్మెల్సీ బీటీ నాయుడు ప్రారంభించారు.
శాసనమండలిలో ఎన్నికల హామీలపై చర్చకు వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి ఛైర్మన్ మోషేను రాజు తెలిపారు. తరువాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మండలిలో చర్చ జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు మండలిలో చర్చ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అసత్యాలే చెప్పారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపణలు చేశారు. వరుదు కల్యాణి వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.
రాష్ట్రంలో దళితులపై దాడులు చేసింది ఎవరో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్సీ దళితులకు గుండు కొట్టించారని, మరొక ఎమ్మెల్సీ శవాన్ని డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. దళితుల పట్ల దారుణాలు చేసిన వారంతా కౌన్సిల్లోనే ఉన్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దివాళా తీసిందని స్పష్టం చేశారు.
బెదిరించలేదు:ఎపీపీఎస్సీ ఛైర్మన్‌ను బెదిరించారంటూ వరుదు కల్యాణి చేసిన అవాస్తవ స్టేట్మెంట్ను వెనక్కి తీసుకోవాలని లోకేశ్ కోరారు. సబ్యురాలి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ సభ్యురాలు వరుదు కల్యాణి ఎగతాళిగా మాట్లాడటం సరైంది కాదన్న లోకేశ్, గత ఐదేళ్లతో వైఎస్సార్సీపీ తీసుకురాలేని నిధులను 5 నెలల్లోనే తీసుకువచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లతో రాజీనామా చేయించింది వైఎస్సార్సీపీ సర్కారే అని, ఇప్పుడు మాపై నిందలు మోపడం సరైంది కాదని నారా లోకేశ్ అన్నారు.
గత వైఎస్సార్సీపీ పాలనలో రెవెన్యూ వ్యవస్థ ధ్వంసమైందని, రీసర్వే పేరుతో రికార్డులు తారుమారు చేసి తగాదాలు సృష్టించారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో 10 లక్షల కోట్లు అప్పులు చేసిందని, నిధులన్నీ దారి మళ్లించి వైఎస్సార్సీపీ నేతల జల్సాలకు వెచ్చించారని మండిపడ్డారు. ధ్వంసమైన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం సరిచేస్తోందని, జగన్ నిర్వాకం చూసి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.
ఆంగ్ల మాధ్యమంపై వాగ్వాదం: ఈ సమయంలో ఆంగ్ల మాధ్యమం అంశంపై కూటమి సభ్యులు, వైఎస్సార్సీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే విధంగా 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని గవర్నర్ ప్రసంగంలో ముందే ఎలా చెప్పారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణ్ ప్రశ్నించారు. దీనిపై మంత్రి లోకేశ్ వివరణ ఇచ్చారు. ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు చాలా ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేశ్ అన్నారు. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని చెప్పట్లేదని, పరిశ్రమలు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.