National Techno Cultural Fest 2025 : విద్యార్థుల్లోని మేధస్సును వెలికితీయడం ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించడం వారిని ఉత్తమంగా తీర్చిదిద్దడంపై నేటి విద్యాసంస్థలు దృష్టి సారిస్తున్నాయి. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చూడుతూ సృజనకు పదును పెట్టేలా స్టూడెంట్స్‌ని ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగానే విజయవాడలో తొలిసారిగా జాతీయస్థాయి టెక్నో-కల్చరల్ ఫెస్ట్ జరిగింది. ఇందుకు కానూరులోని వీఆర్ సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీ వేదికైంది.
టీసీఎస్ రీజినల్ హెడ్ పర్వీన్ అహ్మద్ సుప్రజ్ఞ టెక్నో-కల్చరల్ ఫెస్ట్ 2025ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల నుంచి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా పలు పోటీలను నిర్వహించారు. మొత్తం ఏడు విభాగాల్లో ఇంజినీరింగ్ యువత ఔరా అనిపించే ఆవిష్కరణలు రూపొందించారు. శాస్త్ర, సాంకేతిక రంగం, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లో విభిన్నమైన ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు.
ఏదేని కార్యాలయం లేదా ఆసుపత్రికి వెళ్లినప్పుడు మనకు అవసరమైన విభాగం ఎక్కుడుందో తెలుసుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ సరికొత్త రోబోను విద్యార్థులు ఆవిష్కరించారు. అదేలా సమాచారం అందిస్తుందో వివరిస్తున్నారు. మరో విద్యార్థి బృందం ప్రమాదంలో చేతులు కోల్పోయిన వారికి ఉపయోగపడే రోబోటిక్ హ్యాండ్ రూపొందించింది. రోబోటిక్ హ్యాండ్ అమర్చిన తర్వాత మొబైల్ ద్వారా వాయిస్ మెసేజ్ ఇస్తే మనం చెప్పిన పని చేస్తుందని చెబుతున్నారీ ఇన్నోవేటర్స్.
VR Siddhartha Cultural Fest 2025 : గ్యాస్ లీకేజీ కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగిన ఘటనలు చాలా చూశాం. అయితే గ్యాస్ లీకైనప్పటికీ మంటలు రాకుండా చేయడం ఎలా? అని ఆలోచించారీ ఔత్సాహికులు. ప్రమాదాన్ని హెచ్చరించడంతో పాటు మంటలు రాకుండా నియంత్రంచేలా అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. తక్కువ ధరలోనే ఇంట్లో అమర్చుకునేలా రూపొందించామని అంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న తరుణంలో రీ సైక్లింగ్ చేసి రోడ్లు వేయోచ్చంటున్నారీ ఔత్సాహికులు. తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన రోడ్లు వేయోచ్చని వివరిస్తున్నారు.