Narsampet BRS Councillors Resign :వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం బీఆర్ఎస్పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ ఛైర్ పర్సన్ గుంటి రజనీకిషన్ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ వైస్ ఛైర్ పర్సన్‌తో సహా 14 మంది గులాబీ పార్టీ కౌన్సిలర్లు రాజీనామా బాట పట్టారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు.
కౌన్సిలర్ల పట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఛైర్ పర్సన్ గుంటి రజనీకిషన్ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ప్రవేశ పెట్టిన అవిశ్వాసం వీగిపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో పదవులకు కూడా రాజీనామా చేస్తామని పేర్కొన్నారు.
Councillors Against Municipality Chairperson : అంతకుముందు నర్సంపేట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఏర్పాట్లు చేశారు. కానీ ఈ అవిశ్వాస తీర్మానానికి కౌన్సిల్ సభ్యులు హాజరుకాకపోవడంతో మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. ఆ తరువాత కూడా కౌన్సిల్ సభ్యులెవరూ హాజరుకాలేదు. దీంతో అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ గుంటి రజనీకిషన్కు వ్యతిరేకంగా సొంత పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం తీసుకు రావాలని నిర్ణయించారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ 14 మంది గులాబీ పార్టీ కౌన్సిలర్లు ఈ నెల 2న జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వగా, ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
NoConfidence Motion on BRS Chairperson :నర్సంపేట మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో బీఆర్ఎస్ పార్టీకి 18 మంది,కాంగ్రెస్‌కు ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాసం తీర్మానం నెగ్గాలంటే 17 మంది కౌన్సిలర్ల మద్దతు తప్పనిసరి. ఈ క్రమంలో ఛైర్ పర్సన్‌తో సహా ఇద్దరు కౌన్సిలర్లు కలిసి రహస్య శిబిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సమావేశానికి హాజరైయ్యేలా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.