Nara Lokesh Shankharavam Meeting: తెలుగుదేశం హాయంలో ఎన్నో కంపెనీలను తెస్తే, వైసీపీ ప్రభుత్వం వాటిని తరిమేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌కు ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ వరాల జల్లు కురిపించారు.
తెలుగుదేశం- జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ యత్నిస్తోందని విమర్శించారు. పసుపు సైన్యం, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే రెండు నెలలు చాలా కీలకమని లోకేశ్ తెలిపారు. ఇరుపార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడి ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. విశాఖను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చంద్రబాబు చేస్తే, వైసీపీ ప్రభుత్వం గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేసిందని లోకేశ్ మండిపడ్డారు.
రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందన్న లోకేశ్, రెండు నెలలు ఓపిక పడితే టీడీపీ-జనసేన ప్రభుత్వం ఖాయమని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక విశాఖను విషాదపట్నంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీ తీసుకొచ్చేవారని తెలిపారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రోజుకొక భూకుంభకోణం, హత్యలు, కిడ్నాప్‌లు తీసుకొస్తోందని ఎద్దేవా చేశారు. ఎవరన్నా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించడం మొదలెట్టారని లోకేశ్ విమర్శించారు.