Nara Lokesh Shankharavam Meeting: ప్రశాంత విశాఖను వైసీపీ ప్రభుత్వం విషాదనగరంగా మార్చేసిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వ అరాచకంతో వేలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందంటే జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్న వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే గంజాయి అన్నదే లేకుండా చూస్తామని ఉత్తర నియోజకవర్గ సభలో హామీ ఇచ్చారు.
జగన్ విలాసాల కోసం రుషికొండపై 500 కోట్లతో భవనాలు నిర్మించారని లోకేశ్ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ భవనాలను ప్రజల అవసరాలకు వాడతామని గాజువాక సభలో వెల్లడించారు. అగనంపూడి వద్ద టోల్ గేట్ ఎత్తేస్తామని, గాజువాకలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎక్కడైనా సీఎం చేసిన మంచి పనులను చెప్పుకొంటారని రాప్తాడు సభలో జగన్ మాత్రం చంద్రబాబు పేరును 108 సార్లు స్మరించారని గుర్తుచేశారు.
సూపర్ 6 మ్యానిఫెస్టో చూసి జగన్ భయపడుతున్నారు: లోకేష్
అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోవడమే జగన్ పని అని నారా లోకేశ్ మండిపడ్డారు. గాజువాకలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడారు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన ఘనత జగన్‌ది (YS Jagan) అని ధ్వజమెత్తారు.
రేపో, మాపో గాలిపై కూడా పన్ను వేస్తారేమో అని ఎద్దేవా చేశారు. వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగనే అని ఆరోపించారు. ఇంటింటికి వచ్చి వాలంటీర్లు అబద్ధాలు చెబుతున్నారని లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు.
వైసీపీ పాలనలో విశాఖలో విధ్వంసం - రోజుకో భూకబ్జా, కిడ్నాప్ : నారా లోకేశ్
టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమదని లోకేశ్ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు కనీసం ఒక్క పరిశ్రమ అయినా జగన్ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కును సైతం అమ్మేస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా చూసే బాధ్యత తనదని లోకేశ్ పేర్కొన్నారు. గంగవరం పోర్టు బాధితులను ఆదుకునే బాధ్యత తీసుకుంటానన్నారు. ఏపీఐఐసీ బాధితుల సమస్య రెండేళ్లలో పరిష్కరిస్తామని లోకేశ్ అన్నారు.