Nara Lokesh Comments in Bheemili: రుషికొండపై 500 కోట్ల రూపాయలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్‌ను టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అంకితం చేస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఒక్కడి కోసం వందల కోట్ల ప్రజాధనం వెచ్చించారని మండిపడ్డారు. రుషికొండను బోడిగుండు చేసి విధ్వంసం సృష్టించారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో భూములు కొట్టేసి ఇక్కడి ప్రజలతో జగన్ ఆడుకున్నారని విశాఖ జిల్లా భీమిలి 'శంఖారావం' సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో జనమే జగన్‌ను ఫుట్ బాల్ ఆడుకుంటారని ఎద్దేవా చేశారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కృషి చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వానికి చెల్లిస్తున్న టాక్స్‌లను తాము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని తెలిపారు. విశాఖతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆడుకుంటోందని, మరో రెండు నెలల్లో విశాఖనే వైఎస్సార్సీపీతో ఆడుకుంటుందని అన్నారు.
జగన్‌కు అభ్యర్థులు దొరకడం లేదు- వై నాట్ పులివెందుల అనేదే మా నినాదం: చంద్రబాబు
ఇంతకు ముందు విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా ఉండేదని, ప్రస్తుతం వైఎస్సార్సీపీ పాలనలో విశాఖను గంజాయి రాజధానిగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తే తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది ఎదురైతే కాపాడుకోలేకపోయారని వాపోయారు. ప్రజల కష్టాలను చూసి చంద్రబాబు సూపర్ సిక్స్ రూపొందించారని, అది ఆంధ్రుల భోజనం, రాయలసీమ రాగి సంకటిలా ఉంటుందని అన్నారు.