Nampally court summons to Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖపై సినీనటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువునష్టం దావా కేసులో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12 జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగ్గా ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ టెక్స్‌టైల్స్ మంత్రిగా ఉన్న సమయంలో సినీనటి సమంత చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని మంత్రి కొండా సురేఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే సమంత షూటింగ్‌కు రాకపోతే సమంతను పంపాలంటూ కేటీఆర్ నాగార్జునను అడిగారని, ఆ విషయాన్నే మంత్రి మీడియాకు వెల్లడించారని పేర్కొన్నారు.
విచారణ డిసెంబర్ 12 కు వాయిదా :మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలకు, కోర్టుకు వెల్లడిస్తున్న వివరాలకు పొంతన లేదంటూ నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు. గాంధీ జయంతి రోజున బాఫూఘాట్ వేదికగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అప్పటి మంత్రి కేటీఆర్‌కి ఎన్ కన్వెన్షన్ అంశాన్ని ముడిపెడుతూ సమంతకు సంబంధించి అసభ్యకరమైన ప్రతిపాదన ముందుంచారని, దానిని నాగార్జున మద్దతు ఇచ్చినట్టు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని అశోక్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ మేరకు అక్కినేని నాగార్జున, సాక్షులు న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారని స్పష్టం చేశారు. ఇరువురి వాదనల అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 12కి వాయిదా వేసింది.
అసలేంటి వివాదం :తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య - సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ హీరో నాగార్జున గతంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజుల క్రితం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.