Pardhi Gang Arrested in Hyderabad :హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న పార్థీ గ్యాంగ్ ముఠా ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నగర శివారులోని పెద్ద అంబర్‌పేట రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవలే జాతీర రహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బాధితులు తిరిగబడితే హత్యలు చేసిన ఘటనలు కూడా జరిగాయి. అప్రమత్తమైన నల్గొండ పోలీసులు నిఘా పెట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారిని పట్టుకునే పనిలో పడ్డారు.
శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వారిని వెంబడించారు. రాచకొండ పరిధిలోకి దొంగలు పారిపోగానే స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారి దుండగులు కత్తులతో ఎదురుదాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కడంతో వారిని అరెస్టు చేసి నల్గొండకు తరలించారు.
గత రెండు నెలల నుంచి హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారిపై దొంగలు రెచ్చిపోతున్నారు. వాహనదారులను దోపిడీ చేస్తూ ప్రతిఘటిస్తే ప్రాణాలు తీస్తున్నారు. మే నెల 18న ఏపీ నుంచి సరకును హైదరాబాద్‌లో దిగుమతి చేసి తిరిగి వెళతున్న క్రమంలో అలసిపోయి వాహనాన్ని ఆపిన డ్రైవర్‌ను దోపిడీ చేసే ప్రయత్నంలో కిరాతకంగా చంపారు. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో ఆగి ఉన్న లారీ నుంచి 250 లీటర్ల డీజిల్‌ను దొంగలించారు. 25వ తేదీన మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో రూ.20 లక్షల విలువ చేసే ఇనుము దోచుకెళ్లారు. 28వ తేదీన నకిరేకల్ పటేల్ నగర్‌లో ఓ ఇంట్లో 8 తులాల బంగారం ఎత్తుకుపోయారు.