Delay in Nadu Nedu Works at Vijayawada :విజయవాడ దుర్గాపురంలోని శ్రీ టి. వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ, ఇక్కడ పునాదుల్లోనే ఆగిపోయాయి. కొన్ని భవనాల స్లాబులు పూర్తైనా, మరికొన్ని అసలు నిర్మాణమే ప్రారంభం కాలేదు. మొత్తంగా ఇక్కడ నాడు-నేడు పనులు అసంపూర్ణంగా వెక్కిరిస్తున్నాయి.
Nadu Nedu Works in AP :విజయవాడ మొగల్‌రాజపురంలోని బోయపాటి శివరామకృష్ణయ్య నగరపాలక ఉన్నత పాఠశాల పరిస్థితి ఇంతే. ఇక్కడ నాడు-నేడు పనులు విద్యార్థుల పాలిట ప్రమాదంలా మారాయి. ప్రచార ఆర్భాటంతో గుంతలు తీసి నిర్మాణాలు చేపట్టకుండా వదిలేశారు. పటమటలంక ప్రాంతంలోని వల్లూరు సరోజినీదేవి స్కూల్లో పనులు అటుఇటూ కాకుండా పోయాయి. తరగతి గదుల్లోని బెంచీల్ని బయపడేసి చేపట్టిన పనులు కొలిక్కిరాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.
ఇలా వైఎస్సార్సీపీ సర్కార్ నాడు-నేడు పనుల్లో చేసిన జాప్యానికి, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు విడతల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ ఊదరగొట్టిన జగన్, కనీసం రెండో విడత పనులూ పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారు. 1500 మంది విద్యార్థులుండే విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మున్సిపల్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తికాక వరండాలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు చెట్లకింద కూర్చుని మధ్యాహ్న భోజనం తింటున్నారు. ఇక్కడ నాడు-నేడు పనులకు రూ.2.4 కోట్లు కేటాయించినా, రూ.1.10 కోట్లు మాత్రమే బిల్లులు మంజూరు చేశారు. మిగతా నిధులు ఇవ్వకపోవడంతో ఏడాది కాలంగా పనులు ఆగిపోయాయి.
"గత ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో నిర్మాణాలన్నీ అసంపూర్తిగా మారాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు రావాలంటే భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులను ఆపివేశారు. ఇప్పటికైనా నాడు-నేడు పనులు పూర్తి చేయాలని కోరుతున్నాం. ఇవి పూర్తి చేయాలంటే కొత్త ప్రభుత్వానికి 200 కోట్లపైగా ఖర్చు అవుతుంది." -నేతలు