Nadendla Manohar Allegations on YSRCP Government: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా సలహాదారులను నియమించడంతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం జరుగుతోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్ జన రంజకంగా ఉందని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
రామకృష్ణారెడ్డికే 140 కోట్లు ఖర్చు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా సలహాదారులను నియమించుకుని సుమారు 680 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డికే రూ. 140 కోట్లు ఖర్చు చేశారని మనోహర్ చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 89 మందిని సలహాదారులుగా నియమించుకుందని అన్నారు. వారంతా ఎలాంటి సలహాలు ఇచ్చారో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. వీరిలో కొంత మంది సలహాదారులు ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం లేకపోవడంతో రాజీనామాలు సమర్పించారని చెప్పారు. వీరికి అనవసరంగా నిధులు కేటాయిస్తూ డబ్బులను వృథా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో హైకోర్టు సలహాదారుల విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని తెలిపారు. సలహాదారుల నిర్ణయం ద్వారానే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అప్పట్లో ప్రకటించారని వెల్లడించారు. సలహాదారులు ఇచ్చిన సలహాలు ఎక్కడైనా ఉపయోగపడ్డాయా చెప్పాలని డిమాండ్ చేశారు. అంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ సీఎం జగన్కు సలహాలు ఇచ్చే వ్యక్తులు ఇద్దరు మాత్రమే అని తెలిపారు.
'ఫిబ్రవరి నుంచి పవన్ కల్యాణ్ ప్రజల్లోనే' - రోజుకు మూడు సభల్లో పాల్గొంటారు: నాదెండ్ల