Musi Residents Association Protest: మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్లను కూల్చే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ లక్టీకపూల్లోని జిల్లా కలెక్టరేట్ ముందు మూసీ నిర్వాసితుల సంఘం ధర్నా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో తమ ఇళ్లను కూల్చి అభివృద్ధి చేస్తామనడం సరికాదన్నారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
అష్టకష్టాలు పడి డబ్బులు పెట్టి ఇండ్లను నిర్మించుకున్నామని తమ పేరుతో రిజిస్టర్ కూడా జరగాయని వాపోయారు. చిన్నచిన్న కూలీ పనులు చేసుకుంటూ ఆటోలు, రిక్షాలు నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు ఉన్నాయని, కరెంట్, నల్లాబిల్లులు, ప్రాపర్టీ టాక్స్ ఇవన్నీ కడుతున్నామని ప్రభుత్వం తమకు అన్ని హక్కులు కల్పించిందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా సంస్థ పేరుతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, మూసీరివర్ బెడ్ అని చెప్పి తమ ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తమని సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పంపించడం ఎంత వరకు న్యాయమన్నారు. ఊర్లో పొలాలు అమ్ముకొని, తమ మెడలో ఉన్న బంగారం అమ్ముకొని బ్యాంకు లోను తీసుకొని ఇళ్లను కట్టుకున్నామన్నారు. ఇప్పటికీ ఆ ఇంటి అప్పు తీరక నానా కష్టాలు పడుతున్నామన్నారు. మూసీ అభివృద్ధి పేరు చెప్పి తమ ఇండ్లను తొలగిస్తే మా బతుకులు వీధిన పడే ప్రమాదం ఉందని కావున మూసీని అభివృద్ధి చేసి తమని కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు.