Munneru Flood Victims Gradually Recovering :ఊహించని ఉప్పెనతో చెల్లాచెదురైన ఖమ్మం మున్నేరు పరివాహ ప్రాంత ప్రజలు ప్రభుత్వం అండతో త్వర త్వరగా తేరుకుంటున్నారు. ప్రవాహ తాకిడితో ఇళ్లలో సామాన్లన్నీ కొట్టుకుపోగా, పరిసరాలు దుర్గంధంగా మారాయి. తిరిగి సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు మున్నేరు ముంపు ప్రాంతాల్లో అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
ముంపు కాలనీల్లో ఫైర్ ఇంజిన్‌లతో సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. వాగు వరదకు ఇళ్లలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించే పని ముమ్మరంగా సాగుతోంది. వివిధ జిల్లాలను రప్పించిన వెయ్యి మంది పారిశుధ్ధ్య సిబ్బంది పరిశుభ్రతా యజ్ఞంలో పాల్గొంటున్నారు. డివిజన్ల వారీగా ప్రత్యేక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి చెత్తను పోగు చేసి 700 ట్రాక్టర్లు జేసీబీ, పొక్లెయిన్ల సాయంతో వ్యర్థాలను తరలిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులు నిరంతం పర్యవేక్షిస్తున్నారు.
860 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే : వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో అంటురోగాలు, జ్వరాలు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ముంపు బాధిత కాలనీల్లో 860 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి ఆరోగ్య సర్వేను అధికారులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 40 వేల మందికి ఆరోగ్య సర్వే చేయగా, వరదల తాకిడికి వెయ్యి మందికి జ్వరాలు, పలువురికి డయేరియా సోకినట్లు వైద్య బృందాలు గుర్తించాయి. బురద పేరుకుపోయిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.