Muncipal Workers Agitation in Anantapur : అనంతపురం పట్టణంలోని పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం వేధిస్తుందని నగరానికి చెందిన కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. దాదాపుగా ఎనిమిది నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో ఇంట్లోని కుటుంబం మెుత్తం పస్తులు ఉంటున్నారని వాపోయారు. నగరంలో క్లాప్ ఆటోలు 44 ఉండగా వీటికి డ్రైవర్లు, సహాయకులుగా పనిచేస్తున్న కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వమంటే ఈరోజు రేపు అంటూ అధికారులు సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'సమస్యలపై మేము రోడ్డెక్కాం - పట్టించుకోకుండా సీఎం జగన్ ఆడుకుంటున్నారు'
ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో నిరసనగా ఇంటింటికి చెత్తసేకరణ పనులను కార్మికులు కొద్దిరోజులుగా నిలిపివేశారు. దీంతో నగరంలో ఎటు చూసినా చెత్త కుప్పలు పేరుకుపోయాయి. ఈ మధ్యనే కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ మేఘ స్వరూప్ కార్మికులను పిలిచి మాట్లాడారు. మీ సమస్యలన్ని పరిష్కరిస్తాం. ఇకపై నగరపాలక సంస్థ నుంచి వేతనాలు చెల్లిస్తామని హామి ఇచ్చారు. కాబట్టి ఎప్పటిలాగే ఇంటింటికి వెళ్లి చెత్తసేకరణ చేయాలని తెలిపారు. వారిపై నమ్మకంతో చెత్తసేకరణ పనులను నెలన్నరగా చేస్తున్నాం. కానీ ఇప్పటికి వేతనాలు రాలేదని కార్మికులు మండిపడ్డారు.
Municipal Workers Strike : దీంతో ఎనిమిది నెలల పాతబకాయిలతో పాటు ఈ నెల వేతనం ఇవ్వాలంటూ పారిశుధ్య కార్మికులు కంచాలు పట్టుకొని బిక్షాటనతో వినూత్న నిరసన చేశారు. వీరితో పాటు మురుగు కాల్వల్లో పూడిక తీసే గ్యార్బేజ్ కార్మికులు, నగరంలో ఫాగింగ్ చేసే 33 మంది కార్మికులు, మురుగు కాల్వలు శుభ్రం చేసే 70 మంది కోవిడ్ కార్మికులు తమకు రావాల్సిన నాలుగు నెలల వేతనాల కోసం రోడ్డెక్కారు.
"మున్సిపల్ కార్మికులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం జీతాలు పెంచకపోగా కార్మికుల పొట్టా కొడుతున్నారు. కానీసం చేసిన పనికి జీతాలు ఇవ్వకుండా 8 నెలలుగా వేధిస్తున్నారు. దీంతో కుటుంబం మెుత్తం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇది వరకు ఉన్న అధికారులందరూ జీతాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురిచేశారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన కమిషనర్ సైతం బకాయి చెల్లిస్తానని కార్మికులను మోసం చేశారు. ఈరోజు ఉగాది పండుగ కూడా చేసుకోలేని పరిస్థితిలో కార్మికులు ఉన్నారు."- బాబయ్య, పారుశుద్ధ్య కార్మికుడు
ఎనిమిది నెలలుగా జీతాల్లేవు- పండుగ నాడు కూడా పస్తులే : పారిశుద్ధ్య కార్మికులు "జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సమానపనికి సమాన వేతనం ఇస్తామని మాటిచ్చారు. ఇచ్చిన మాట తప్పడంతో దాదాపు 16రోజులు సమ్మెచేస్తే ప్రతి కార్మికుడికి రూ.21వేలు జీతాన్ని మార్చి ఒకటో తేదీ నుంచి చెల్లిస్తామని తెలిపారు. కానీ ఈరోజుకి చెల్లించలేదు. దీంతో కుటుంబపోషణ తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈరోజు ఉగాది పండుగఉన్న జరుపుకోవడానికి డబ్బులులేక ఇలా రోడ్డుపై ఆందోళనలు చేస్తున్నాం. మాతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు తప్ప జీతాలు ఇవ్వటం లేదు. ఇప్పటికైన ప్రభుత్వం తమ గురించి ఆలోచించి జీతాలు వెంటనే చెల్లించాలి."- వరలక్ష్మి, కార్మిక సంఘం నేత
'మమ్మల్ని పర్మినెంట్ చేయండి.. తక్షణమే డిమాండ్లు పరిష్కరించండి'