Mumbai Actress Harassment Case Update :వైఎస్సార్సీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో ముంబయి సినీ నటి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు కార్యాలయానికి వెళ్లిన ఆమె తనపై జరిగిన వేధింపులు వివరించి న్యాయం చేయాలని ఆయన్ను కోరారు. తర్వాత విచారణ అధికారి అయిన ఏసీపీ స్రవంతిరాయ్‌ను కలిసి ఫిర్యాదు కాపీ అందజేశారు. తనవద్ద ఉన్న డాక్యుమెంట్ ఆధారాలు, ఆడియో, వీడియో, ఫొటోలను అందించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల 15నిమిషాలకు మొదలైన విచారణ రాత్రి 10గంటల 15 నిమిషాల వరకు సాగింది.
తనపై తప్పుడు కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కీలకపాత్ర పోషించారని ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీనివెనుక అప్పటి నిఘావిభాగం అధిపతి సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని ఉన్నారని దర్యాప్తు అధికారికి వివరించారని తెలిసింది. విజయవాడలో తనపై కేసు నమోదుచేసే ముందే ఇంటెలిజెన్స్ బృందాన్ని సీతారామాంజనేయులు ముంబయి పంపి తమ ఇంటివద్ద రెక్కీ చేశారని, అంతా అనుకూలంగా ఉందని ఖరారు చేసుకుని ముందస్తు ప్రణాళికలో భాగంగా విద్యాసాగర్‌తో ఫిర్యాదు ఇప్పించి, కేసు నమోదుచేశారని, ఆమె పోలీసులకు నివేదించినట్లు సమాచారం.
సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ప్రచారం :వెంటనే విజయవాడ పోలీసులు ముంబై వచ్చి అక్కడ కేసు ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి చేసి సంతకాలు తీసుకున్నారని చెప్పినట్లు సమాచారం. తనపై ఎక్కడా కేసులు లేవని, అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ప్రచారం చేస్తున్నారని వివరించారని తెలిసింది. తాను పలువురిని హనీట్రాప్ చేసినట్లు ప్రచారం చేయడం తగదన్న ఆమె, ముంబయిలో ప్రస్తుతం ఉంటున్న ఇంటిని 2020లో కొన్నానని, ఆ చిరునామాతో 2018నాటి తేదీతో బోగస్ ఒప్పంద పత్రం సృష్టించారని దర్యాప్తు అధికారికి చెప్పారు.