MUMBAI ACTRESS CASE: ఏ ఫోర్జరీ కేసు పెట్టి బాలీవుడ్ నటిని కటకటాలపాలు చేశారో, ఇప్పుడు అదే కేసు పోలీసుల మెడకు చుట్టుకోబోతుంది. ముంబయి నటిపై అక్రమ కేసు పెట్టి, వేధింపులకు గురి చేసిన వ్యవహారంలో డొంక కదులుతోంది. రెండు రోజుల విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. హీరోయిన్, ఆమె కుటుంబ సభ్యుల అరెస్టుకు విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదే ఆధారమని తెలుస్తోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, 5 ఎకరాల పొలంపై హక్కులు పొందినట్లు తప్పుడు పత్రం సృష్టించినట్లు వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు చేశారు. అసలు ఈ ఫోర్జరీ పత్రం గురించి సరిగా దర్యాప్తు చేయకుండానే కేసు నమోదు చేసినట్లు నటి ఆరోపించారు.
దీనికితోడు ఆ భూమిని కొన్నారని చెబుతున్న ఇద్దరు కీలక సాక్షులు పోలీసులకు అప్పట్లో ఇచ్చిన స్టేట్‌మెంట్లకు ఎదురుతిరిగారు. ఈ పరిణామం పలువురు పోలీసు అధికారుల మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను పోలీసులకు స్టేట్‌మెంట్ ఇవ్వలేదని, తన ఆధార్‌కార్డు తీసుకుని విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు చిందా వీరవెంకట నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు బోరుకాటి భరత్‌కుమార్‌లు చెబుతున్నారు. వీరిద్దరినీ కమిషనర్ కార్యాలయానికి పిలిపించి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. వీరిని రెండో రోజూ పిలిచి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా విచారించారు.
కేసు నమోదు చేసిన సమయంలో ఇబ్రహీంపట్నం సీఐ ఎదుట నాగేశ్వరరాజు, భరత్‌కుమార్‌లు ఇచ్చిన స్టేట్‌మెంట్లను చూపించి, ఎవరి ఒత్తిడితో అలా చెప్పారని దర్యాప్తు అధికారి ప్రశ్నించారు. కుక్కల విద్యాసాగర్ చెప్పిన మీదటే తాము వ్యవహరించినట్లు వివరించినట్లు తెలుస్తోంది. సాక్షులను నటితో పాటు ఎదురెదురుగా కూర్చోబెట్టి, వారికి ప్రశ్నలను అడిగి సమాధానాలను రాబట్టినట్లు సమాచారం. ఇవాళ మిగిలిన సాక్షులను పిలిచి వారిని కూడా క్షుణ్ణంగా ప్రశ్నించనున్నారు.
ముంబయి నటి, ఆమె తల్లిదండ్రులు, మరికొందరిని విచారణ అధికారి స్రవంతి రాయ్ నగర పోలీసు కమిషనరేట్‌కు పిలిపించి వివరాలు రాబట్టారు. ప్రధానంగా దర్యాప్తులో పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం. కీలక పోలీసు అధికారి ప్రమేయం గురించి కూడా నటి కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు తెలిసింది. అప్పట్లో నగర కమిషనరేట్‌లో పనిచేసిన పలువురు అధికారుల్ని పిలిపించి వివరాలు సేకరించారు. కేసు నమోదు, అరెస్టు, కస్టడీ సమయంలో వారు నిర్వర్తించిన పాత్ర గుర్తించి విచారించారు.