MULUGU BLACKBERRY ISLAND: ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత, ఉల్లాసం కోసం కేవలం సిటీలలో ఉండేవారే కాకుండా, గ్రామాల్లో ఉండే జనం సైతం సమయం కేటాయిస్తున్న రోజులివి. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో కొన్ని రోజులపాటు సరదాగా టూర్‌కి వెళ్లాలనుకునే వారి కోసం ఎంతో అందమైన ‘బ్లాక్ బెర్రీ ఐలాండ్’ ఆహ్వానం పలకనుంది.
ఇదెక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండ్యాలతోగు సమీపంలో ఉన్న ఈ ఐలాండ్‌ని పర్యాటక శాఖ ఎంతో సుందరంగా తీర్చిదిద్దింది. నాలుగువైపులా ఉండే జలగలాంచ వాగు మధ్య సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో చల్లని వాతావరణంలో, ప్రకృతి వనం మధ్య ఉన్న ఈ ఐలాండ్ టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒకటి రెండు రోజుల్లో ప్రారంభానికి రెడీగా ఉన్న ఐలాండ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- ప్రశాంత వాతావరణంలో నైట్ స్టే:పర్యాటకులు రాత్రి బస చేసేందుకు ఐలాండ్‌లో 50 మోడర్న్ టెంట్లు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఉండేలా 25, ముగ్గురు ఉండేలా 21, నలుగురు ఉండేలా 4 టెంట్లు రెడీ చేశారు.
- జలకాలాటలకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు:యువత సరదాగా ఆడుకొనేందుకు బీచ్ వాలీబాల్ తరహాలో ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటు చేశారు. చిన్నారులు, ఇతరుల కోసం షటిల్ కోర్టులు అధిక సంఖ్యలో ఉన్నాయి. కబడ్డీ, ఖోఖో వంటి ఆటలు కూడా ఆడుకోవచ్చు. ఐలాండ్ చుట్టూ ప్రవహించే జలగలాంచ వాగు నీటిలో చిన్నారులు ఆటలు ఆడుకొనేందుకు సైతం ఏర్పాట్లు చేశారు. వాగులో ఫిషింగ్ చేసే అవకాశం కూడా కల్పించనున్నారు.
- మీకు ఇష్టమైన భోజనం: ప్రకృతి ఒడిలో గడిపేందుకు వచ్చిన పర్యాటకుల ఇష్టాల మేరకు భోజనం తయారు చేసి వడ్డించేందుకు రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ, నార్త్ ఇండియన్ వంటలు చేసే చెఫ్‌లను నియమించారు.
- సోలార్ విద్యుత్ సదుపాయం:తాడ్వాయి-పస్రా మార్గం మధ్యలో 163వ నేషనల్ హైవేకి కిలోమీటరు దూరంలో ఉన్న అడవిలో ఉన్న ఈ ఐలాండ్‌లో రాత్రంతా విడిది చేసే టూరిస్ట్‌లకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోలార్ విద్యుత్తు సదుపాయం కల్పించారు. ఐలాండ్ చుట్టూ విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. వెదురు బొంగుల కంచెతోపాటు పర్యాటకులకు రక్షణగా స్టాఫ్‌ని కూడా నియమించారు.
- రాత్రివేళ క్యాంప్ ఫైర్:సినిమాల్లో చూపించే విధంగా రాత్రివేళ చలిమంటలు(క్యాంప్ ఫైర్) వేసుకుని, అక్కడ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. అడవినంతా చూసే విధంగా ఏర్పాటు చేసిన మంచె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.
- ఇంతకీ ఎలా చేరుకోవచ్చంటే:బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌కి ఇటు హైదరాబాద్ నుంచి, అటు ఏపీ నుంచి బస్సుల్లో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి భద్రాచలం, ఏటూరునాగారం, మంగపేట వైపు వెళ్లే బస్సుల్లో పస్రా వద్ద దిగాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే భద్రాచలంలో దిగి, అక్కడి నుంచి హైదరాబాద్, వరంగల్, హనుమకొండ బస్సుల్లో ఇక్కడకి చేరుకోవచ్చు.
- ఇలా బుక్ చేసుకోవచ్చు: హైదరాబాద్ నుంచి సుమారు 220 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ ఐలాండ్‌లో స్టే చేసేందుకు పర్యాటక శాఖ యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా వెబ్‌సైట్ సైతం రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి ధరను ఇంకా నిర్ణయించనప్పటికీ ఒక్కొక్కరికి రోజుకు సుమారు 1,500 నుంచి 2 వేల రూపాయల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.